Taiwan Earthquake: తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత
యిలాన్ నగరం నుండి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం
వరల్డ్ వైడ్ గా తరచుగా సంభవిస్తున్న భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తైవాన్ లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈశాన్య తీరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భవనాలు కంపించాయి. నివాసితులు ప్రాణ భయంతో వణికిపోయారు. యిలాన్ నగరం నుండి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. గత మూడు రోజుల్లో తైవాన్‌ను వణికించిన రెండవ బలమైన భూకంపం ఇది. రాజధాని తైపీలో భూకంపం సంభవించిందని, అక్కడ భవనాలు కంపించాయని, ప్రాణ, ఆస్తి నష్టాన్ని ప్రస్తుతం అంచనా వేస్తున్నామని జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది.
భూకంపం తర్వాత యిలాన్‌లోని 3,000 ఇళ్లలో విద్యుత్ సరఫరాకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడిందని తైవాన్ ఇంధన సంస్థ తెలిపింది. రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ వద్ద ఉన్న తైవాన్ , భూకంపాలకు అత్యంత గురయ్యే ప్రాంతంగా పరిగణిస్తారు. తైవాన్‌లో భూకంపాలు ఎంత నష్టం కలిగిస్తాయో గణాంకాలే చెబుతున్నాయి. 2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపం 100 మందికి పైగా మృతి చెందగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం 2,000 మందికి పైగా మృతి చెందారు.