India Venezuela Relations: వెనిజులా పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన
చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపు
వెనిజులాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా డెల్టా దళాలు శనివారం అరెస్ట్ చేశాయి. వెనిజులాలోని ఓ సైనిక స్థావరంపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం వారిని యుద్ధనౌక ద్వారా న్యూయార్క్‌కు తరలించాయి.
మదురోపై అమెరికా తీవ్రమైన నార్కో టెర్రరిజం ఆరోపణలు మోపింది. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, భారీ పరిమాణంలో కొకైన్‌ను అమెరికాకు తరలించారని ఫెడరల్ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. 1999 నుంచి 2025 వరకు సాగిన ఈ అక్రమ రవాణాకు మదురో నాయకత్వం వహించారని యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ వెల్లడించారు. ఈ కేసులో మదురో భార్య, కుమారుడితో పాటు పలువురు ఉన్నతాధికారుల పేర్లను కూడా చేర్చారు. ప్రస్తుతం మదురో న్యూయార్క్‌లోని ఫెడరల్ జైలులో ఉన్నారు.
మదురో అరెస్ట్ నేపథ్యంలో వెనిజులా సుప్రీంకోర్టు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ పరిపాలనలో అంతరాయం కలగకుండా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది. దేశ సమగ్రత, పరిపాలనా కొనసాగింపునకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది.
వెనిజులా పరిణామాలపై భారత్ ఆందోళన
ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనిజులాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. సంబంధిత పక్షాలన్నీ చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.