US-RUSSIA: ఒక్క అక్షరం తప్పుతో అమెరికా రహస్యాలు బహిర్గతం
ఒక్క అక్షరంతో మార్పుతో అమెరికా శత్రు దేశానికి కీలక సమాచారం... తలలు పట్టుకున్న అగ్రరాజ్య అధికారులు;
ఒక్క అక్షరం.. అవును ఒకే అక్షరం.... అమెరికా రహస్యాలను బట్టబయలు చేస్తోంది. శత్రు దేశం రష్యాకు మంచి చేస్తోంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారం అసలు ఏ ప్రయత్నం చేయకుండానే రష్యా మిత్రదేశానికి హాయిగా చేరుతోంది. ఇలా పదేళ్లపాటు ఆ ఒక్క అక్షరం తప్పు వల్ల కీలక సమాచారం అంతా రష్యా మిత్రదేశమైన మాలికి చేరిపోయింది. ఓ వ్యాపారవేత్త గుర్తింపుతో ఈ తతంగం అంతా బయటపడింది. ఈ అక్షరం తప్పు తెలుసుకున్న అమెరికన్ రక్షణశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ అక్షరం కథేంటంటే...
అమెరికా((USA) సైన్యానికి వెళ్లాల్సిన ఈమెయిల్స్ ఒక్క అక్షరం మార్పుతో రష్యా మిత్ర దేశం డొమైన్‌కు చేరుతున్నాయి. సదరు మెయిల్స్‌లో అత్యంత సున్నితమైన సమాచారం కూడా ఉంది. అమెరికాకు చెందిన సైనిక రహస్యాలు, మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లు ఉన్న లక్షల కొద్దీ ఈమెయిల్స్ రష్యా(Russia) మిత్రదేశమైన మాలి చేతికి దక్కాయి. దీనంతటికీ ఒక టైపింగ్ తప్పు కారణమైంది. సాధారణంగా అమెరికా సైన్యం తమ బృందాలతో కమ్యూనికేషన్ల కోసం .MIL అనే ఎక్స్‌టెన్షన్ ఉన్న డొమైన్ వాడుతుంది. కానీ, చాలా సందర్భాల్లో అమెరికా సైన్యంలోని వారు మెయిల్ చేసే సమయంలో పొరబాటున .ML అని టైపు చేసేవారు. దీంతో ఆ మెయిల్స్ మొత్తం మాలి డొమైన్‌కు వెళ్లాయి. వీటిల్లో అమెరికా ఆర్మీ చీఫ్ పర్యటనలో బసచేసే హోటల్ గది నంబర్ల వంటివి కూడా ఉన్నాయి.
ఈ విషయాన్ని జోహన్నస్ జూర్బిర్ అనే డచ్ వ్యాపారవేత్త గుర్తించాడు. అతడు మాలి డొమైన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. దాదాపు పదేళ్ల నుంచి అమెరికా సైన్యం నుంచి లక్షల సంఖ్యలో మెయిల్స్ వచ్చినట్లు అతడు వివరించాడు. తొలుత తమ డొమైన్‌లో లేని మెయిల్ అడ్రస్‌లకు కూడా .ML ఎక్స్‌టెన్షన్‌తో మెయిల్స్ రావడాన్ని గమనించాడు. ఆ తర్వాత ఇవి పొరబాటున వస్తున్నట్లు గమనించాడు. దీంతో ఇటువంటి మెయిల్స్‌ను ఓ చోటకు చేర్చడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇటువంటివి లక్షా 17 వేల ఈ మెయిల్స్ వచ్చాయి. వీటిల్లో అమెరికా సైన్యానికి చెందిన మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లు, సైనికుల మెడికల్ రికార్డులు, స్థావరాల ఫొటోలు, స్థావరాల్లో సిబ్బంది సంఖ్య, నౌకాదళ కదలికలు, నౌకల్లో సిబ్బంది వివరాలు, పన్ను వివరాలు వంటి సున్నితమైన సమాచారం ఉంది. మెయిల్స్ దారి మళ్లుతున్న విషయంపై అతడు చాలా సార్లు అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. వీటిల్లో అమెరికా సైనిక సిబ్బంది, సైన్యంతో కలిసి పనిచేసే ట్రావెల్ ఏజెంట్లు, ఇంటెలిజెన్స్ సిబ్బంది, ప్రైవేటు కాంట్రాక్టర్లు, ఇతరులు పంపిన మెయిల్స్ అధికంగా ఉన్నాయి.
మాలి ప్రభుత్వంతో జోహన్నస్ జూర్బిర్ కాంట్రాక్టు సోమవారంతో ముగిసింది. దీంతో మాలి ప్రభుత్వమే నేరుగా ఈ డొమైన్‌ను ఆధీనంలోకి తీసుకొంది. దీంతో దారిమళ్లిన అమెరికా ఈమెయిల్స్ ఆ దేశం సిబ్బంది చూసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ ప్రతినిధి టామ్ గోర్మన్ వెల్లడించారు. .MILకు వెళ్లకుండా మాలి డొమైన్‌కు వెళుతున్న ఈమెయిల్స్‌ను బ్లాక్ చేసినట్లు తెలిపారు.