Donald Trump: బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్ దాడి..
ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ హెచ్చరిక
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ‘గ్రీన్ జోన్’లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై తాజాగా మిస్సైల్ దాడి జరిగింది. ఈ దాడిలో రాయబార కార్యాలయ ఆవరణలోని హెలిప్యాడ్‌ను క్షిపణి నేరుగా తాకడంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇరాక్ నుంచి అత్యవసరం కాని సిబ్బందిని వెనక్కి వెళ్లాలని అమెరికా ఆదేశించిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
మరోవైపు, ఇరాన్‌పై అమెరికా తన దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ‘ఖర్గ్ ఐలాండ్’ పై అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ బాంబు దాడి జరిపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఖర్గ్ ఐలాండ్‌లోని అన్ని సైనిక స్థావరాలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆయన వెల్లడించారు. ‘‘ప్రస్తుతానికి మానవతా దృక్పథంతో చమురు మౌలిక సదుపాయాలను తాకలేదు, కానీ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్ ఆటంకం కలిగిస్తే మాత్రం ఆ చమురు క్షేత్రాలను కూడా బూడిద చేయడానికి వెనుకాడను’’ అని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా అంతే దీటుగా స్పందించింది. ఒకవేళ తమ దేశ చమురు మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తే.. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా వాటాలు ఉన్న అన్ని చమురు కంపెనీలను, ఎనర్జీ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రాంతీయంగా ఉన్న ప్రతి చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని బూడిద కుప్పగా మారుస్తామని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.