Crude Oil : యుద్ధం ముదురుతోంది.. చమురు మండుతోంది.. 15 రోజుల్లోనే 50 శాతం పెరిగిన క్రూడాయిల్.

Update: 2026-03-14 07:45 GMT

Crude Oil :మధ్యప్రాచ్యంలో రాజుకున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఇంధన రంగాన్ని దహించివేస్తున్నాయి. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రసంగాలు చేస్తున్నా, మరోవైపు అమెరికా ప్రభుత్వం ఇరాన్ సుప్రీం లీడర్‌తో సహా 10 మంది అగ్రనేతల తలలపై కోటి డాలర్ల (సుమారు రూ.83 కోట్లు) భారీ రివార్డు ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ ఉద్రిక్తతల వల్ల గత 15 రోజుల్లోనే ముడి చమురు ధరలు ఏకంగా 50 శాతం పెరిగి సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల పరిస్థితి చూస్తుంటే భయం వేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే 100 డాలర్ల మార్కును దాటేసింది. ఫిబ్రవరి 26న కేవలం 70 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ధర, ఇప్పుడు 103 డాలర్లకు పైగా చేరుకుంది. అంటే కేవలం రెండు వారాల్లోనే 45 శాతం పెరిగింది. ఇక అమెరికన్ చమురు పరిస్థితి మరీ ఘోరం.. ఇది ఏకంగా 51 శాతం ఎగబాకింది. ఒకానొక దశలో ఈ ధరలు 120 డాలర్ల వరకు వెళ్లినప్పటికీ, ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇరాన్ తన దాడులను ఉధృతం చేస్తే ఈ ధరలు ఎక్కడికి చేరుకుంటాయోనని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.

భారతదేశంపై ఈ యుద్ధ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మన దేశానికి అవసరమైన చమురులో 80 శాతం, గ్యాస్ సరఫరాలో 60 శాతం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గం గుండానే వస్తుంది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో భారత్‌లో చమురు ధరలు చుక్కలను తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గత 15 రోజుల్లో బ్యారెల్ ధర రూ.6,053 నుంచి రూ.9,052 కి చేరింది. మార్చి 9న అయితే ఇది ఆల్‌టైమ్ హై రూ.10,549కి చేరి రికార్డు సృష్టించింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

మున్ముందు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోల్డ్‌మన్ సాక్స్, యూబీఎస్ వంటి అంతర్జాతీయ బ్యాంకులు తమ అంచనాలను సవరించాయి. హోర్ముజ్ జలసంధి గనుక మరికొన్ని వారాల పాటు మూతపడితే, బ్యారెల్ చమురు ధర 150 డాలర్ల వరకు వెళ్లవచ్చని ఉడ్ మెకంజీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రావడం ఖాయం. ప్రస్తుతం భారత్ ఇరాన్‌తో జరిపిన చర్చలు సఫలమైతేనే మన దేశానికి చమురు నౌకలు సురక్షితంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News