Alabama shooting: అమెరికాలో మరోసారు నడివీధిలో కాల్పులు, ఇద్దరి మృతి, 12 మందికి గాయాలు
క్షతగాత్రుల్లో ఏడుగురు 17 ఏళ్ల లోపు వారే
అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. అలబామా రాష్ట్ర రాజధాని మాంట్‌గోమరి నగరంలో రెండు ప్రత్యర్థి వర్గాలు నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడ్డాయి. జనసమర్ధం అధికంగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఏడుగురు 17 ఏళ్ల లోపు మైనర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని పర్యాటక ప్రాంతంలో ఉన్న ఓ కూడలి వద్ద జనం గుమిగూడి ఉన్న సమయంలో రెండు వర్గాలు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాయి. ఇది ఒక భారీ కాల్పుల ఘటన అని మాంట్‌గోమరి పోలీస్ చీఫ్ జేమ్స్ గ్రాబోయ్స్ మీడియాకు వెల్లడించారు. "రెండు వర్గాలు చుట్టూ ఉన్న జనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నాయి" అని ఆయన తెలిపారు.
గాయపడిన 12 మందిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు మహిళ అని పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల్లో అత్యంత చిన్న వయసున్న వ్యక్తి వయసు 16 సంవత్సరాలు. స్థానికంగా రెండు కాలేజీల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంతం రద్దీగా ఉంది.
ఈ ఘటనపై నగర మేయర్ స్టీవెన్ రీడ్ తీవ్రంగా స్పందించారు. "ఈ అన్యాయానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టేందుకు మా వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారని, అనుమానితులను విచారిస్తున్నారని పోలీస్ చీఫ్ తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.