MUSK: ప్రపంచంలోనే తొలి 'ట్రిలియనీర్' కానున్న ఎలాన్ మస్క్!
ప్రపంచంలోనే తొలి ‘ట్రిలియనీర్’గా ఎలాన్ మస్క్?.. స్పేస్‌ఎక్స్ ఐపీఓపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
ఈ భూమి మీద అందరి కంటే ధనవంతుడెవరంటే ప్రపంచానికి వెంటనే గుర్తొచ్చే పేరు ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి దిగ్గజ సంస్థల అధినేత అయిన మస్క్, త్వరలోనే మరో అరుదైన, సరికొత్త రికార్డును సృష్టించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆయన అంతరిక్ష పరిశోధనల సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ (IPO)కు వెళుతోంది. వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఐపీఓగా నిలవనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మెగా ఐపీఓ పుణ్యమా అని ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి 'ట్రిలియనీర్'గా (అంటే లక్ష కోట్ల డాలర్లు లేదా దాదాపు రూ.96 లక్షల కోట్ల అధిపతిగా) అవతరించనున్నారు.
ఐపీఓ లెక్కలు.. మస్క్ సంపద..
స్పేస్‌ఎక్స్ ఐపీఓ ముసాయిదా పత్రాల ప్రకారం ఎలాన్ మస్క్‌కు ఆ సంస్థలో ఏకంగా 510 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటితో పాటు ఒక్కోటి 8.39 డాలర్ల విలువ చేసే 35 కోట్ల స్టాక్ ఆప్షన్స్ కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఒక వేళ స్పేస్‌ఎక్స్ ఐపీఓ ద్వారా మార్కెట్లో 2 లక్షల కోట్ల (2 ట్రిలియన్) డాలర్ల మార్కెట్ విలువను సొంతం చేసుకుంటే, మస్క్ నికర సంపద ఒక్కసారిగా 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది. ఒకవేళ కంపెనీ ఆశించిన దానికంటే కాస్త తక్కువగా, అంటే 1.75 లక్షల కోట్ల డాలర్ల వద్ద నమోదైనా కూడా మస్క్‌కు డోకా లేదు. ఎందుకంటే ఆయనకు టెస్లా, ఇతర కంపెనీల్లో ఉన్న భారీ వాటాలను దీనికి కలిపితే, ఆయన మొత్తం సంపద సులభంగా లక్ష కోట్ల డాలర్ల (ట్రిలియన్ డాలర్లు) మార్కును దాటేస్తుంది. గతేడాదే 500 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.48 లక్షల కోట్లు) సంపదను దాటిన తొలి వ్యక్తిగా నిలిచిన మస్క్, ఇప్పుడు దానికి రెట్టింపు సంపదతో సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.
అంగారకుడిపై కాలనీ.. మైండ్ బ్లోయింగ్ షరతులు!
మస్క్ నికర సంపదను మరింత పెంచేందుకు స్పేస్‌ఎక్స్ కొన్ని అద్భుతమైన, ఊహకందని పనితీరు ఆధారిత ప్యాకేజీలను కూడా సిద్ధం చేసింది. మొదటి షరతు: స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ కనుక 7.5 లక్షల కోట్ల డాలర్లకు చేరి, అంతకంటే ముందు అంగారక గ్రహం (Mars) మీద కనీసం 10 లక్షల మంది ప్రజలతో ఒక శాశ్వత మానవ కాలనీని ఏర్పాటు చేస్తే మస్క్‌కు అదనంగా 100 కోట్ల రిస్ట్రిక్టెడ్ షేర్లు లభిస్తాయి. రెండో షరతు: ఒకవేళ కంపెనీ 6.6 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించి, భూమియేతర గ్రహాల్లో 100 టెరావాట్ వార్షిక సామర్థ్యంతో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తే ఆయనకు మరో 30 కోట్ల రిస్ట్రిక్టెడ్ షేర్లు దక్కుతాయి.
ఈ అసాధారణ షరతులు పక్కన పెట్టినా, కేవలం ప్రస్తుత స్పేస్‌ఎక్స్ ఐపీఓతోనే మస్క్ చేరబోయే 1.1 లక్షల కోట్ల డాలర్ల సంపద ఒక సంచలనం. ఎందుకంటే, ప్రపంచంలో ఆయన తర్వాత స్థానంలో ఉండే అత్యంత ధనవంతుడి సంపద కంటే మస్క్ సంపద మూడు రెట్లకు పైగా ఎక్కువగా ఉండబోతోంది. ఈ ఐపీఓ కేవలం ఎలాన్ మస్క్‌కు మాత్రమే కాకుండా, స్పేస్‌ఎక్స్ సంస్థలోని ఇతర కీలక అధికారులకూ కాసుల వర్షం కురిపించనుంది. కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యిత మార్కెట్ విలువను గనుక చేరితే, ఈ ఐపీఓ ద్వారా సంస్థలోనే కొత్త బిలియనీర్లు పుట్టుకురానున్నారు.