Foreign Spends : ఫారిన్ టూర్లపై తగ్గిన ఇంట్రెస్ట్.. ఆర్బీఐ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు.

Update: 2026-05-25 06:15 GMT

Foreign Spends : భారతీయులలో విదేశీ ప్రయాణాలపై ఉన్న క్రేజ్ క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అంటున్నాయి ఆర్బీఐ తాజా గణాంకాలు. ఈ ఏడాది మార్చి నెలలో భారతీయులు విదేశీ పర్యటనల కోసం చేసిన ఖర్చులు భారీగా పడిపోయాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో ఈ ఖర్చులు ఏకంగా 16 శాతం మేర తగ్గినట్లు ఆర్బీఐ డేటా స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరిలో భారతీయులు ఫారిన్ ట్రిప్పుల కోసం 1.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, మార్చి వచ్చేసరికి అది 1.09 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకంటే ముందు జనవరి నెలలో ఈ ఖర్చు ఏకంగా 1.65 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే భారతీయులు విదేశీ ప్రయాణాల బడ్జెట్‌ను భారీగా తగ్గించుకున్నారని స్పష్టమవుతోంది.

ఎల్‌ఆర్ఎస్ స్కీమ్ అంటే ఏంటి?

కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ అమలు చేస్తున్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద భారతీయులు విదేశాలకు పంపే నిధుల ఆధారంగా ఈ డేటాను లెక్కించారు. ఈ ప్రత్యేక స్కీమ్ ప్రకారం.. ఒక భారతీయ పౌరుడు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2.5 లక్షల డాలర్ల (దాదాపు రూ.2 కోట్లకు పైగా) వరకు చట్టబద్ధంగా విదేశాలకు పంపవచ్చు. ఈ డబ్బును విదేశాల్లో చదువుకునే పిల్లల ఫీజుల కోసం, అక్కడున్న బంధువుల ఖర్చుల కోసం, విదేశీ ప్రయాణాలు, వైద్యం, అంతర్జాతీయ షేర్లలో పెట్టుబడులు, స్థిరాస్తుల కొనుగోలు వంటి వివిధ అవసరాల కోసం వాడుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా బయటకు వెళ్లే నిధుల్లో ఎప్పుడూ ట్రావెల్ కేటగిరీదే పైచేయిగా ఉండేది, కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది.

గ్లోబల్ టెన్షన్లు, రూపాయి బలహీనత

భారతీయులు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడానికి లేదా బడ్జెట్ తగ్గించుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటిది పశ్చిమ ఆసియా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు. రెండవది అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల విమాన టికెట్ల రేట్లు ఆకాశాన్ని తాకడం. మూడవది అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ నిరంతరం బలహీనపడటం. దీనివల్ల విదేశాల్లో హోటల్ బుకింగ్స్, షాపింగ్ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. వీటన్నింటికీ తోడు, దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం విదేశీ పర్యటనలను కాస్త తగ్గించుకోవాలని, కార్పొలింగ్ లాంటి పద్ధతులను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు పిలుపునివ్వడం కూడా జనంపై ప్రభావం చూపింది.

చదువుల కోసం భారీగా ఖర్చు

మార్చి నెలలో భారతీయులు విదేశాలకు పంపిన మొత్తం నిధులు 2.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో విహారయాత్రలు, అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ పేమెంట్లు ఉండే సాధారణ ట్రావెల్ కేటగిరీలోనే అత్యధికంగా 623.05 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. దీని తర్వాత స్థానంలో విదేశీ విద్య నిలిచింది. ఉన్నత చదువుల కోసం మార్చి నెలలో భారతీయులు 450.16 మిలియన్ డాలర్లను విదేశీ యూనివర్సిటీలకు ఫీజుల రూపంలో పంపించారు. అదే సమయంలో బిజినెస్ టూర్లు, మెడికల్ ట్రీట్‌మెంట్, తీర్థయాత్రల కోసం కేవలం 21.39 మిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారతీయులు విదేశీ పర్యటనలపై ఖర్చులు తగ్గించినప్పటికీ, విదేశీ షేర్లు, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టే పెట్టుబడులను మాత్రం భారీగా పెంచారు. మార్చి నెలలో భారతీయులు గ్లోబల్ మార్కెట్లలో 440.22 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే విదేశాల్లో ఇళ్లు, ల్యాండ్స్ లాంటి ప్రాపర్టీలు కొనడానికి చేసే ఖర్చు మాత్రం 38.68 మిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) మొత్తంలో ఎల్‌ఆర్ఎస్ కింద భారతీయులు 29.56 బిలియన్ డాలర్లను విదేశాలకు పంపగా, అందులో సింహభాగం ప్రయాణాలకే పోయింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ, భారతీయుల ఖర్చుల్లో ఫారిన్ టూర్లదే ఇప్పటికీ పెద్ద వాటా అని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News