Neuralink Chip: మరో 6 నెలల్లో మనిషి మెదడులో చిప్: ఎలాన్ మస్క్
Neuralink Chip: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన బ్రెయిన్ చిప్ ఇంటర్‌ఫేస్ స్టార్టప్ అభివృద్ధి చేసిన వైర్‌లెస్ పరికరాన్ని ఆరు నెలల్లో మనిషి మెదడులో అమర్చనున్నట్లు ప్రకటించారు.;
Neuralink Chip : టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన బ్రెయిన్ చిప్ ఇంటర్‌ఫేస్ స్టార్టప్ అభివృద్ధి చేసిన వైర్‌లెస్ పరికరాన్ని ఆరు నెలల్లో మనిషి మెదడులో అమర్చనున్నట్లు ప్రకటించారు.
మస్క్ ఆరేళ్ల క్రితం బ్రెయిన్ కంట్రోల్ ఇంటర్‌ఫేస్ స్టార్టప్‌ను స్థాపించారు. కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నాణెం పరిమాణంలో ఉండే కంప్యూటింగ్ బ్రెయిన్ ఇంప్లాంట్‌ను మనిషి మెదడులో అమర్చాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆరు నెలల్లో మానవుని మెదడులో న్యూరాలింక్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నట్లు మస్క్ ఈవెంట్‌లో చెప్పారు.
ఇది కంప్యూటర్, మొబైల్ ఫోన్ లేదా ఏదైనా ఇతర పరికరాన్ని మెదడు కార్యకలాపాలతో నేరుగా నియంత్రించేలా చేస్తుంది. ఈ పరికరం నాడీ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల జీవితాలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారు.
పక్షవాతం వచ్చినవారి వెన్నుపూసలో ఈ చిప్ అమర్చితే చచ్చుబడిన అవయవాల్లో కదలిక వస్తుందని భావిస్తున్నారు. అలాగే చూపు కోల్పోయిన వారికి సైతం ఈ పరికరం పనికొస్తుందని ఆశిస్తున్నారు. ఈ రెండింటిలో కచ్చితంగా తాము విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మస్క్‌కు కృత్రిమ మేధపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవులకన్నా తెలివైనదని భవిష్యత్తులో మానవాళిపై విజయం సాధిస్తుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే దాన్ని ఎదుర్కునేందుకే న్యూరాలింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కృత్రిమ మేథను అధిగమించి మానవ మేధస్సును, సామర్ధ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.