లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ కొత్త చీఫ్‌గా నయీం ఖాసీమ్‌ను నియమించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన హసన్ నస్రల్లా వారసుడిగా ఖాసీమ్ బాధ్యతలు తీసుకోనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఖాసీమ్ హిజ్బుల్లాకు డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా అదే పదవిలో కొనసాగుతున్నాడు. నస్రల్లా మరణానంతరం మిలిటెంట్ సంస్థకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎన్నికను హిజ్బుల్లా నిర్ణయాధికార సంస్థ ‘షురా’ కౌన్సిల్ ధ్రువీకరించింది. అయితే నయీమ్ కంటే ముందు నస్రల్లా బంధువు హషీమ్ సైఫిద్దీన్ పేరు హిజ్బుల్లా చీఫ్ రేసులో ప్రధానంగా వినిపించింది. కానీ ఆయన కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. ఈ క్రమంలోనే ఖాసీమ్‌ను చీఫ్‌గా నియమించినట్టు తెలుస్తోంది