Pakistan: భారత్‌తో ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించిందన్న నవాజ్

పీఎంఎల్‌ అధ్యక్షుడిగా మళ్లీ నవాజ్‌ ఎన్నిక;

Update: 2024-05-29 03:00 GMT

పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడిగా పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మళ్లీ ఎన్నికయ్యారు. లాహోర్‌ వేదికగా మంగళవారం నిర్వహించిన పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏకగ్రీవంగా ఆయన పేరును ఖరారు చేశారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పనామా పేపర్ల కేసులో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో నాలుగేళ్ల క్రితం లండన్‌ వెళ్లిపోయి, గతేడాది అక్టోబర్‌లోనే స్వదేశానికి తిరిగొచ్చారు. దాదాపు ఆరేళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు ఆయన చేతికి వెళ్లడం గమనార్హం. నవాజ్‌ పదవిలో ఉండగా 1998, మే 28న పాక్‌ తొలిసారి అణు పరీక్షలు చేపట్టగా.. ఆ చారిత్రక ఘట్టానికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజే ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

లాహోర్‌ డిక్లరేషన్‌పై ఆ దేశ మాజీ ప్రధాని షరీఫ్‌ అంగీకారంIndia Nawaz Sharif Pakistan violated peace

అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత అంటే ఫిబ్రవరి 21, 1999న అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయీ పాక్‌కు వచ్చారనీ, ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్య శాంతి కొనసాగేలా ‘లాహోర్‌ డిక్లరేషన్‌’ పేరిట చేసుకున్న ఒప్పందాన్ని తామే ఉల్లంఘించినట్లు నవాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. ఆ తీర్మానం జరిగిన కొన్ని రోజులకే పాక్‌ దళాలు కశ్మీర్‌లోకి చొరబడటం, భారత సైన్యం వారిని అడ్డుకోవడం.. అది యుద్ధానికి దారితీయడం జరిగిందన్నారు. అణు పరీక్షలు నిలిపివేస్తే 5 బిలియన్‌ డాలర్లు ఇస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ముందుకొచ్చినా.. తాను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌లాంటి వ్యక్తులు అధికారంలో ఉంటే, ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలిపే వారని నవాజ్‌ విమర్శించారు. తన మీద నిరాధార ఆరోపణలు చేసి 2017లో అధికారం నుంచి దూరం చేశారని మండిపడ్డారు.

Tags:    

Similar News