Nepal: నేపాల్ రాజకీయాల్లో సరికొత్త మలుపు.. విలీనం కానున్న జెఎస్పీ, ఎల్ఎస్పీ
సంయుక్త ప్రకటనపై సంతకం చేసిన రెండు పార్టీల అధ్యక్షులు
నేపాల్ రాజకీయాల్లో సరికొత్త మలుపు వెలుగు చూసింది. మార్చి 5న జరగనున్న నేపాల్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆదివారం రెండు ప్రధాన పార్టీలు విలీనం అవుతున్నట్లు ప్రకటించాయి. మహంత ఠాకూర్ నేతృత్వంలోని జనతా సమాజ్ వాదీ పార్టీ (జెఎస్పీ), ఉపేంద్ర యాదవ్ నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ సమాజ్ వాదీ పార్టీ (ఎల్ఎస్పీ) విలీనం అవుతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిని విశ్లేషించి, నేపాల్‌లో సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరాన్ని గ్రహించిన తర్వాత ఈ రెండు పార్టీలు విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీల నాయకులు వెల్లడించారు. విలీనం అయిన రెండు పార్టీల అధ్యక్షులు సంతకం చేసిన సంయుక్త ప్రకటనలో “సమాఖ్యవాదం, గుర్తింపు, సామాజిక న్యాయం వంటి ప్రగతిశీల మార్పుకు సంబంధించిన అంశాలను బలోపేతం చేయడం ద్వారా న్యాయమైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో రెండు పార్టీలను ఏకం చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. అవసరమైన చర్చలు, విధానపరమైన విషయాలు తరువాత వెల్లడిస్తాం ” అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఖాట్మండు మెట్రోపాలిటన్ మునిసిపాలిటీ మేయర్ బాలేంద్ర షా (బాలెన్) రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) తరుఫున మార్చి 5న జరిగే నేపాల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో ఆదివారం ఆయనను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) తరుఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బాలెన్, ఆయన పార్టీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం కేటాయించిన RSP ఎన్నికల చిహ్నం “గంట” గుర్తుపై పోటీ చేయనున్నారు.