Plane Crash: మంటల్లో నుంచి ఎగిరిపడిన ఇంజిన్‌.. కెంటకీ విమాన ప్రమాదంపై వెలుగులోకి వచ్చిన నిజాలు

నవంబర్ 5న జరిగిన ఈ దుర్ఘటనలో 14 మంది మృతి

Update: 2025-11-21 06:15 GMT

అమెరికాలోని కెంటకీలో 14 మందిని బలిగొన్న కార్గో విమాన ప్రమాదంపై మిస్టరీ వీడింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ విడిపోవడం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. మంటలతో కూడిన ఇంజిన్ విమానం నుంచి ఊడి పడుతున్న దృశ్యాలను అధికారులు విడుదల చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నవంబర్ 5న లూయిస్‌విల్లే మహ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం భూమికి కేవలం 30 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, దాని ఎడమ రెక్క భాగంలోని ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి, కాసేపటికే అది విమానం నుంచి విడిపోయి కిందపడిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు.

ఈ విమానం కెంటకీ నుంచి హొనోలులుకు బయల్దేరింది. ప్రమాదంలో విమానంలోని ముగ్గురు సిబ్బందితో పాటు, విమానాశ్రయంలోని గ్రౌండ్‌లో ఉన్న మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కార్గో విమానంలో దాదాపు 2.8 లక్షల గ్యాలన్ల ఇంధనం ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి, ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు.

Tags:    

Similar News