Nicolas Maduro: అమెరికా నిర్బంధంలో నికోలస్ మదురో ... చైనా విదేశాంగ మంత్రి ఏమన్నారంటే
బలప్రయోగాన్ని చైనా ఎప్పుడూ సమర్థించదన్న వాంగ్ యీ
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అమెరికా సైనిక బలగాలు పట్టుకుని న్యూయార్క్‌కు తరలించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చను రేపుతోంది. ఈ సంఘటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, అమెరికా తనను తాను ప్రపంచ పోలీస్‌గా భావించుకుని ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. ఏ దేశానికి అంతర్జాతీయ న్యాయమూర్తిగా వ్యవహరించడానికి అర్హత లేదని, బలప్రయోగంతో తమ ఇష్టాలను రుద్దడం సరికాదని స్పష్టం చేశారు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితి అస్థిరంగా ఉందని ఆయన చెప్పారు. బలప్రయోగాన్ని చైనా ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని రక్షించాలని అన్నారు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని తెలిపారు.
గత రెండు దశాబ్దాలుగా వెనెజువెలా చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనా, ఈ ఘటనను ఏకపక్ష దురాక్రమణగా అభివర్ణిస్తూ అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సంబంధాలను మరింత దిగజారుస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.