Nobel prize 2024: ప్రొటీన్లపై పరిశోధనలకు నోబెల్‌

డేవిడ్‌ బేకర్‌, జాన్‌ జంపర్‌, డెమిస్‌ హస్సబిస్‌కు అవార్డు;

Update: 2024-10-10 03:30 GMT

 ప్రొటీన్లపై జరిపిన పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం దక్కింది. డేవిడ్‌ బేకర్‌, డెమిస్‌ హస్సబిస్‌, జాన్‌ జంపర్‌కు ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్‌ కమిటీ ఫర్‌ కెమిస్ట్రీ చైర్మన్‌ హైనెర్‌ లింకె బుధవారం ప్రకటించారు. డేవిడ్‌ బేకర్‌ ప్రస్తుతం వాషింగ్టన్‌ యూనివర్సిటీలో పని చేస్తుండగా డెమిస్‌ హస్సబిస్‌, జాన్‌ జంపర్‌ లండన్‌లోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ అయిన గూగుల్‌ డీప్‌మైండ్‌లో పని చేస్తున్నారు. 2003లో బేకర్‌ ఒక ఊహాత్మక ప్రొటీన్‌ను తయారుచేశారని, ఈ సాంకేతికతతో సృష్టించిన ప్రొటీన్లను ఔషధాలు, వ్యాక్సిన్లు, నానోమెటీరియల్స్‌, సూక్ష్మ సెన్సార్లలో వాడుతున్నట్టు నోబెల్‌ కమిటీ తెలిపింది. 20 కోట్ల ప్రొటీన్ల నిర్మాణ శైలిని గుర్తించేలా హస్సబిస్‌, జంపర్‌ ఒక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నమూనాను తయారు చేసినట్టు పేర్కొన్నది.

జీవం ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలంటే, ముందుగా ప్రొటీన్ల రూపాన్ని అర్థం చేసుకోవాలని, ఇందుకు వీరి ఆవిష్కరణలు ఉపయోగపడుతున్నాయని హైనెర్‌ లింకె పేర్కొన్నారు. అమినో యాసిడ్‌ సీక్వెన్స్‌, ప్రొటీన్‌ స్ట్రక్చర్‌కు మధ్య సంబంధాన్ని గుర్తించిన వీరి పరిశోధనలకు నోబెల్‌తో గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. దశాబ్దాలుగా రసాయన శాస్ర్తానికి, ప్రత్యేకించి జీవ రసాయనశాస్ర్తానికి సవాల్‌గా మారిన అంశానికి వీరి పరిశోధన పరిష్కారం చూపిందని ఆయన చెప్పారు. కాగా, నోబెల్‌ బహుమతి కింద దక్కే రూ.8.4 కోట్లలో బేకర్‌కు సగం దక్కుతుందని, మిగతా సగం హస్సబిస్‌, జంపర్‌కు కలిపి ఇవ్వనున్నట్టు నోబెల్‌ కమిటీ తెలిపింది.

Tags:    

Similar News