US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

ముగ్గురి మృతి పరారీలో నిందితుడు..

Update: 2025-09-28 04:30 GMT

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. నార్త్ కరోలినాలో ఓ దుండగుడు వినూత్న రీతిలో రెస్టారెంట్‌పై దాడికి పాల్పడ్డాడు. బోటులో వచ్చి జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

విల్మింగ్టన్‌కు సమీపంలోని సౌత్‌పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్‌లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. రెస్టారెంట్ సమీపంలోని నీటిలో ఒక బోటు వచ్చి ఆగింది. అందులో ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా రెస్టారెంట్‌లోని వారిపై తుపాకీతో కాల్పులు జరపడం ప్రారంభించాడు. అనంతరం అదే బోటులో వేగంగా పరారయ్యాడు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురిపై బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిటీ మేనేజర్ నోవా సాల్డో ఈ దాడిని ధ్రువీకరించారు. "బోటులో వచ్చిన వ్యక్తి కాల్పులు జరిపి పారిపోయాడు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం" అని ఆయన తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. సౌత్‌పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ప్రజలందరూ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే 911కు సమాచారం ఇవ్వాలని కోరారు. సౌత్‌పోర్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్, బ్రన్స్‌విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం సంయుక్తంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పరారీలో ఉన్న దుండగుడిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News