చైనాకు భారత్‌ను దూరం చేయడమే మా లక్ష్యం.. నూతన అమెరికా రాయబారి సెర్గీ గోర్
భారతదేశానికి కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్ భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను చైనాకు దూరం చేసి, అమెరికాకు దగ్గర చేయడమే తమ ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌ఎన్‌జీకి భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా మార్చాలని అమెరికా కోరుకుంటోందని గోర్ వ్యాఖ్యానించారు.
రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఈ దిశగానే సాగుతున్నాయన్నారు. అమెరికా మొత్తం జనాభా కంటే భారత్‌లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని, ఈ మార్కెట్ అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న టారిఫ్ వివాదాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా, భారత్‌ల మధ్య దశాబ్దాల నాటి స్నేహ సంబంధాలు ఉన్నాయని, చైనాతో పోలిస్తే తమతోనే భారత్‌కు గొప్ప స్నేహం ఉందని ఆయన చెప్పారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాయబారి జామిసన్ గ్రిర్‌తో సమావేశం కోసం భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఇతర ప్రతినిధులను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని గోర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు లాభదాయకమైన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు.