Shehbaz Sharif: మూడు యుద్ధాలు చేశాం, ఫలితం లేదన్న పీఎం షెహబాజ్

ఇస్లామాబాద్, న్యూఢిల్లీ శాంతియుత చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌న్న షెహ‌బాజ్;

Update: 2025-05-17 01:00 GMT

ఇస్లామాబాద్‌లో 'యూమ్-ఎ-తషాకుర్' ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించిన పాకిస్థాన్ ప్రధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ భారత్, పాకిస్థాన్ మూడు యుద్ధాలు చేశాయని, సాధించిందేం లేదని అన్నారు. ఇస్లామాబాద్, న్యూఢిల్లీ శాంతియుత చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని కోరారు. త‌ద్వారా క‌శ్మీర్ అంశంతో స‌హా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అప్పుడే ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొటుంద‌ని తెలిపారు. శాంతి నెల‌కొంటే రెండు దేశాలు ఉగ్ర‌వాద వ్య‌తిరేక చ‌ర్య‌ల్లో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. మన సమస్యలు పరిష్కారం కాకుంటే, ప్రపంచంలోని ఏ భాగంలోనూ మనకు శాంతి ఉండద‌ని షెహ‌బాజ్ అన్నారు.

షెహ‌బాజ్ ఇంకా మాట్లాడుతూ... పాకిస్థాన్ శాంతియుత దేశం అయినప్పటికీ, త‌మ‌ రక్షణ కోసం తగిన సమాధానం ఇచ్చే హక్కు తమ‌కు ఉందని పాక్ ప్ర‌ధాని అన్నారు. "పాకిస్థాన్ ఒక శాంతియుత దేశం. కానీ దాని రక్షణలో తగిన విధంగా ప్రతిస్పందించే హక్కు దానికి ఉంది" అని భారత్‌ ఇటీవల జరిగిన సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ ఆయన అన్నారు.

కాగా, సరిహద్దు వెంబడి డ్రోన్లు, క్షిపణులతో తీవ్రమైన దాడుల‌తో నాలుగు రోజుల పాటు పాక్‌, భార‌త్ మ‌ధ్య కొన‌సాగిన‌ సైనిక ఘర్షణను ఆప‌డానికి ఇరు దేశాలు మే 10న సీజ్‌ఫైర్‌ ఒప్పందానికి వచ్చిన విష‌యం తెలిసిందే.

అయితే, శుక్ర‌వారం భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... 'ఆపరేషన్ సిందూర్' ఇంకా ముగియలేదని ధ్రువీకరించి, పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక చేసిన కొన్ని గంటల తర్వాత పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ షరీఫ్ పైవిధంగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. "సరైన సమయం వచ్చినప్పుడు, మేము ఏంటో ప్రపంచానికి చూపిస్తాం. మేము పాకిస్థాన్‌ను పరిశీలనలోనే ఉంచాం. మీ ప్రవర్తన మెరుగుపడినట్లయితే, అది మీకు మంచిది. కాదు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తే మీకు అత్యంత కఠినమైన శిక్ష ఖాయం" అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఏప్రిల్ 22న 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న‌ పహల్గామ్ ఉగ్ర‌దాడికి ప్రతిస్పందనగా మే 7వ తేదీ తెల్లవారుజామున ఉగ్రస్థావ‌రాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట‌ భారత్ ల‌క్షిత‌ దాడులను నిర్వహించిందని మ‌రోసారి ఆయ‌న గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), ఉగ్రవాదం అనే అంశంపై మాత్రమే పాక్‌తో చర్చలు జరుపుతామని ఈ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News