PAK RICE: భారత్ నిర్ణయంతో "పాక్‌కు కాసుల "పంట"
బాస్మితియేతర బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం... ప్రపంచవ్యాప్తంగా పాక్ బియ్యానికి పెరిగిన డిమాండ్..;
దాయాది దేశం పాకిస్థాన్(Pakistan)కు భారత్(india) తీసుకున్న నిర్ణయం వరంలా మారింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతోంది. ఈ స్థితిలో బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం(bans export of non-basmati white rice) విధించింది. ఈ నిర్ణయమే పాకిస్థాన్‌కు అనుకోని అదృష్టంలా కలిసివచ్చింది. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్‌లో బియ్యం సరఫరా పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతనెల 20న బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం బియ్యంలో బాస్మతియేతర బియ్యం వాటా 25శాతం వరకు ఉంటుంది
భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో పాక్(pak) బియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. యూరప్(europe) సహా చాలా దేశాలు పాక్ బియ్యం ఎగుమతి కోసం(Rice exporters of Pakistan) ఆర్డర్లు ఇస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు పాకిస్థాన్ ఎగుమతిదారులు చెబుతున్నారు. 5మిలియన్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు రష్యా కూడా ఆసక్తి చూపుతున్నట్లు పాకిస్థాన్ బియ్యం ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి తెలిపారు.
బాస్మతియేతర బియ్యం( non-basmati white rice) ఎగుమతుల కోసం రష్యాకు చెందిన 27కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి తమకు పెద్దఎత్తున ఎగుమతి ఆర్డర్లు వస్తున్నట్లు పాకిస్థాన్ రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ప్రపంచ దేశాల నుంచి పాక్ కంపెనీలకు ఆర్డర్లు పెరిగినట్లు ఆ దేశ బియ్యం ఎగుమతుల సంఘం( Pakistan Rice Exporters Association) తెలిపింది.
ఈ ఏడాది పాకిస్థాన్ నుంచి 3బిలియన్ డాలర్ల బియ్యం ఎగుమతులు( export of non-basmati rice) జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో బాస్మతి బియ్యం ధర ఒక్కసారిగా టన్నుకు వంద డాలర్లు పెరిగింది. బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించకముందు పాకిస్థాన్ బాస్మతియేతర బియ్యం టన్ను ధర 450డాలర్లు ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో టన్నుధర 500 డాలర్లకు చేరింది. మంచి నాణ్యత కలిగిన బియ్యం ధర 600డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. బియ్యానికి ప్రపంచమార్కెట్లో డిమాండ్ భారీగా ఉందని, నిషేధం విధించటం వల్ల పాకిస్థాన్‌కు ఎగుమతి ఆర్డర్లు పెరిగాయని పేర్కొన్నారు.