పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. జనవరి 16న మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. గత ఏడాది అబ్దుల్ రహ్మాన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించగా... అందుకు చైనా అడ్డుపడింది. 26/11 ముంభై దాడులలో అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ముఖ్య సూత్రధారి.
UN భద్రతా మండలి 1267, అల్ ఖైదా ఆంక్షల కమిటీ, సోమవారం 68 ఏళ్ల మక్కీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. గతేడాది జూన్ లో భారత్, అమెరికాలు సంయుక్తంగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని తీర్మానించాయి. ఈ ప్రతిపాదనపై 'నో అబ్జెక్షన్' కింద కమిటీలోని 15 సభ్యదేశాలకు UNSC పంపించింది. ఈ ప్రతిపాదనను చైనా అడ్డుపడింది. దీంతో టెక్నికల్ గా పక్కన పెట్టారు. ఈ క్రమంలో 6నెలలు మాత్రమే హోల్డ్ చేసే అవకాశం ఉంది. ఈ ఆరు నెలల కాలం పూర్తయినందున.. సోమవారం మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది UNSC.
ఎవరీ అబ్దుల్ రహ్మాన్ మక్కీ...
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ 'లష్కరే తొయిబా' (LeT)కు వెన్నుముకగా వ్యవహరిస్తుంటాడు అబ్దుల్ రహ్మాన్ మక్కీ. ఉగ్ర దాడులకు ప్రణాళికలు రూపొందించడం, నిధులు సమకూర్చడంతో పాటు, యవకులను ఉగ్రవాదంవైపు ఆకర్శితులను చేస్తుంటాడు. 26/11 ముంబై దాడులతో పాటు, జమ్ము కశ్మీర్ లో జరిగే దాడులలో కూడా మక్కీ హస్తం ఉంది. దేశీయ చట్టాల ప్రకారం ఇప్పటికే భారత్, అమెరికా ఉగ్రవాదిగా గుర్తించాయి. ఇతడు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ కు బావ అవ్వడం గమనార్హం.