Pak Balochistan Operation: బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ ఆపరేషన్..
47 మంది ఉగ్రవాదుల మృతి ?;
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గత రెండు రోజుల్లో పాకిస్థాన్ భద్రతా దళాలు కనీసం 47 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. పాకిస్థాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ (ISPR) శనివారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఆగస్టు 7 – 8 మధ్య రాత్రి జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 33 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. ఆగస్టు 8 – 9 రాత్రి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని సంబాజా చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన మరో ఆపరేషన్‌లో 14 మంది ఉగ్రవాదులు మరణించారని ISPR ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్‌లో ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ సేవలు బంద్..
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆగస్టు 31 వరకు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ISPR అధికారులు తెలిపారు. బలూచిస్తాన్ హోం శాఖ ఈనెల 6న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రావిన్స్‌లో శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ సేవలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ ధ్రువీకరించారు. పాకిస్థాన్‌లో ఈనెల 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు వేడుకల్లో ఆందోళనలు సృష్టించే అవకాశం ఉందని పాక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత గురువారం, వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన బాంబు పేలుడులో సుమారు ముగ్గురు మరణించగా.. అదే సమయంలో, ముగ్గురు పోలీసులతో సహా 13 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లో, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) నవంబర్ 2022లో ప్రభుత్వంతో కాల్పుల విరమణను ముగించినప్పటి నుంచి, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలో తీవ్రవాద దాడులు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు.
బలూచిస్థాన్ ప్రాంతం నైరుతి పాకిస్థాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్గానిస్థాన్లలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన స్థానిక తెగే బలూచీ ప్రజలు. పాక్ మొత్తం జనాభాలో వీరి వాటా 3.6శాతం. ఇరాన్, అఫ్గానిస్థాన్ జనాభాలో రెండు శాతం బలూచ్ ప్రజలు ఉంటారు. మొత్తం పాకిస్థాన్ భూభాగంలో ఇది 44శాతం దాకా ఉంటుంది. బలూచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు బలూచిస్థాన్‌ను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయక ముందు వరకూ ఆ ప్రాంతం స్వతంత్రంగా సొంత గిరిజన పాలనలో ఉండేది. ఇండియా విభజన తరవాత ఈ ప్రాంతం పాకిస్థాన్‌లో భాగం అయ్యింది. అప్పటికి అత్యధిక బలూచిస్థాన్ ప్రాంతాన్ని కలాట్ కేంద్రంగా పాలిస్తున్న రాజు తొలుతా స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేసినా ఆయనపై.. పాకిస్థాన్‌లో విలీనానికి తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీన్ని చాలామంది బలూచిస్థాన్ వాసులు వ్యతిరేకించారు. ఇదే వేర్పాటువాదానికి పునాదిగా నిలిచింది.