Abdali Ballistic Missile : పాక్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌!

450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి;

Update: 2025-05-04 03:45 GMT

భారత్-పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, పాకిస్థాన్ మరో కీలక సైనిక చర్యకు ఉపక్రమించింది. భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించగల 'అబ్దాలీ' క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్షిపణి 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని పాక్ సైన్యం వెల్లడించింది.

పాకిస్థాన్ సైన్యం చేపట్టిన 'ఇండస్' విన్యాసాలలో భాగంగా ఈ 'అబ్దాలీ' వెపన్ సిస్టమ్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆ దేశ సైనిక వర్గాలు తెలిపాయి. తమ సైనిక దళాల కార్యాచరణ సంసిద్ధతను, క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నాయి. ప్రత్యేకించి, క్షిపణిలోని అధునాతన నావిగేషన్ వ్యవస్థలతో పాటు ఇతర కీలక సాంకేతిక అంశాలను ధృవీకరించుకునేందుకే ఈ ప్రయోగం జరిపినట్లు పాకిస్థాన్ వివరించింది.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తరచూ క్షిపణి పరీక్షల నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఏప్రిల్ 24-25, ఏప్రిల్ 26-27 తేదీల్లో కరాచీ తీరంలోని ఎకనామిక్ ఎక్స్‌క్లూజివ్‌ జోన్‌లో క్షిపణి ప్రయోగాలు నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించింది. తాజాగా ఏప్రిల్ 30 నుంచి మే 2 మధ్య మరోసారి పరీక్షలు చేపడుతున్నట్లు తెలియజేసింది. అయితే, పాకిస్థాన్ వరుసగా ఇటువంటి క్షిపణి పరీక్షల ప్రకటనలు చేయడం, ప్రయోగాలు చేపట్టడం వెనుక భారత్‌ను రెచ్చగొట్టే ఉద్దేశం ఉందని భారత రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్... పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. గత తొమ్మిది రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తమపై దాడి చేయవచ్చని పాకిస్థాన్ మంత్రుల్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ భయాల నేపథ్యంలోనే పాక్ ప్రభుత్వం తమ సరిహద్దుల వెంబడి పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తున్నట్లు, గగనతల రక్షణ వ్యవస్థలను, ఫిరంగి దళాలను సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లోని బాడ్‌మెర్‌కు సమీపంలో ఉన్న లాంగేవాలా సెక్టార్‌కు అవతల పాకిస్థాన్ తమ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News