Pakistan: ఆస్తుల వివరాలను రహస్యంగా ఉంచుకునే బిల్లుకు ఆమోదం

తీవ్రంగా వ్యతిరేకించిన ఇమ్రాన్‌ఖాన్ పార్టీ

Update: 2026-01-22 07:45 GMT

పాకిస్థాన్‌లో ఒక కీలక రాజకీయ బిల్లుకు ఆమోదం తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజాప్రతినిధులు తమ ఆస్తుల వివరాలను రహస్యంగా ఉంచుకునేందుకు వీలుగా కల్పించిన బిల్లుకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లును మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యతిరేకించింది.

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ బుధవారం ఎన్నికల సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. దీని ప్రకారం చట్టసభ సభ్యులు తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తుల వివరాలను బహిరంగంగా వెల్లడించకుండా ఉండటానికి వీలు కల్పించనుంది.

ప్రస్తుత చట్టం ప్రకారం.. జాతీయ అసెంబ్లీ, సెనేట్, ప్రాంతీయ అసెంబ్లీ సభ్యులంతా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 లోపు జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన పిల్లలతో సహా ఆస్తులు, అప్పుల వివరాలను పాకిస్థాన్ ఎన్నికల కమిషన్‌(ECP)కి సమర్పించాలి. ఎన్నికల చట్టం 2017లోని సెక్షన్ 138 ప్రకారం ECP ఈ ప్రకటనలను అధికారిక గెజిట్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అయితే తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా ప్రజా ప్రతినిధుల ఆస్తుల వివరాలు రహస్యంగా ఉంచుకునేలా బిల్లు ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం సభ్యులు ఆస్తుల వివరాలు వెల్లడించనవసరం లేదు. తీవ్రమైన ముప్పు కలిగిన వారు పార్లమెంట్ సభ్యులు.. జాతీయ అసెంబ్లీ స్పీకర్ లేదా సెనేట్ ఛైర్మన్‌కు లిఖితపూర్వక అభ్యర్థన సమర్పించవచ్చు. అలాగే ఈసీపీకి గోప్యంగా హామీ పత్రాన్ని సమర్పించినట్లయితే ఒక సంవత్సరం వరకు ఆస్తుల వివరాలు ప్రకటించకుండా మినహాయింపు లభిస్తుంది.

Tags:    

Similar News