Bill Gates: వైట్ కాలర్, బ్లూ కాలర్ రంగాల్లో భారీ మార్పులు రానున్నాయన్న బిల్ గేట్స్
ప్రపంచ రాజకీయాల్లో భారత్-అమెరికా బంధం కీలకమన్న గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కృత్రిమ మేధ (AI) విషయంలో ప్రపంచ దేశాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే ఏఐ ప్రభావంతో ఉద్యోగ మార్కెట్, ముఖ్యంగా వైట్ కాలర్ రంగం ఊహించని విధంగా మారిపోతుందని, ఈ పెను మార్పులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (WEF) సదస్సులో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గేట్స్ మాట్లాడారు. "రాబోయే 4 నుంచి 5 ఏళ్లలో వైట్ కాలర్, బ్లూ కాలర్ రంగాల్లో భారీ మార్పులు రానున్నాయి. పెరుగుతున్న అసమానతలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సి ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏఐ ప్రభావం పరిమితంగానే ఉన్నా, ఈ పరిస్థితి ఎంతోకాలం ఉండదని అన్నారు.
గత సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ఏఐ చాలా వేగంగా, లోతుగా సమాజంలోకి చొచ్చుకుపోతోందని గేట్స్ వివరించారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో ఏఐతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సమానత్వంపై దాని ప్రభావాన్ని నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, పన్నుల విధానాన్ని మార్చడం వంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించారు.
భారత్-అమెరికా బంధం కీలకం..
మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో భారత్-అమెరికా భాగస్వామ్యం ఒక నమ్మకమైన శక్తిగా నిలుస్తుందని గేట్స్ అభిప్రాయపడ్డారు. భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐని వేగంగా అందిపుచ్చుకోవడం వంటివి కీలక ప్రయోజనాలని ఆయన కొనియాడారు.