Ahsan Iqbal: 2035 నాటికి చంద్రుడిపై ల్యాండ్ కావాలని పాక్ కలలు
చిరకాల మిత్రుడు చైనాపైనే ఆధారం;
ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదంతో పోరాడుతున్న పాకిస్థాన్ ఇప్పుడు తమ దృష్టిని ఆకాశం వైపు సారించింది. 2035 నాటికి చంద్రుడిపై కాలు మోపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ చంద్రుడి కలల వెనుక చైనా ఉంది. తన నిజ మిత్రుడు చైనా సాయంతో చంద్రుడిపై ల్యాండ్ కావాలని ఉబలాటపడుతోంది.
ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్.. దేశ అంతరిక్ష సంస్థ ‘సుపార్కో’కు ఈ బాధ్యత అప్పగించినట్టు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు ఒక్క ఉపగ్రహాన్ని కూడా సొంతంగా ప్రయోగించలేని సుపార్కోకు ఈ లక్ష్యం ఎంతవరకు సాధ్యమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
పాకిస్థాన్ అంతరిక్ష కార్యక్రమం అనేది ‘చైనాలో తయారైన’ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. పాకిస్థాన్ ప్రయోగించిన ప్రతి ఉపగ్రహానికి చైనానే సాంకేతిక సహకారం అందించింది. 2026 నాటికి పాకిస్థాన్ తన మొదటి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపాలని యోచిస్తోంది. అది కూడా చైనా అంతరిక్ష కేంద్రం ద్వారానే. 2028లో చైనా చాంగ్'ఈ 8 మిషన్‌లో పాకిస్థాన్ పాల్గొననుంది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడానికి 35 కిలోల రోవర్‌ను పాకిస్థాన్ అందిస్తుందని భావిస్తున్నారు.
1961లో స్థాపించిన సుపార్కో నిధుల కొరతతో కునారిల్లుతోంది. దాని వార్షిక బడ్జెట్ 36 మిలియన్ డాలర్లు మాత్రమే. పైగా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బదులు రిటైర్డ్ సైనిక జనరల్స్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఫలితంగా, అంతరిక్ష సాంకేతికతలో పాకిస్థాన్ స్వయం సమృద్ధి సాధించలేకపోతోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలను కూడా పాకిస్థాన్ సరిగా నెరవేర్చలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో, పాకిస్థాన్ అంతరిక్ష లక్ష్యాలు చైనా సాయం లేకుండా అసాధ్యం అని స్పష్టంగా తెలుస్తోంది.