Bipin Rawat death : బిపిన్ రావత్ మృతికి పాక్ ఆర్మీ సంతాపం..!
Bipin Rawat death : వీరి మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారులు బుధవారం సంతాపం తెలిపారు;
తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ సహా... 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌బేస్ నుంచి వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఎంఐ 17 వీ5 హెలికాప్టర్ కుప్పకూలింది.
ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్ దంపతులు సహా పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు. వీరి మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారులు బుధవారం సంతాపం తెలిపారు.
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సిజెసిఎస్‌సి) జనరల్ నదీమ్ రజా మరియు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సిఓఎఎస్) జనరల్ కమర్ జావేద్ బజ్వా సంతాపం వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. జనరల్ రావత్ మరియు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా 2008లో కాంగోలో జరిగిన UN శాంతి పరిరక్షక మిషన్‌లో కలిసి పనిచేశారు.