Philippines: భారీ భూకంపం.. 72కు చేరిన మృతుల సంఖ్య

బుధవారం నాటి మృతుల సంఖ్యతో పోలిస్తే మూడు రేట్లు ఎక్కువ.

Update: 2025-10-02 04:30 GMT

 ఫిలిప్పీన్స్‌లోని మధ్య ప్రాంతంలో మంగళవారం రాత్రి సంభవించిన 6.9 తీవ్రత గల భూకంపం వల్ల మృతుల సంఖ్య 72కు పెరిగిందని ఆ దేశ పౌర రక్షణ సంస్థ తెలిపింది. గురువారం వెలువరించిన నివేదిక ప్రకారం ఈ భూకంపంలో 294 మంది గాయపడ్డారు. బుధవారం నాటి మృతుల సంఖ్యతో పోలిస్తే ఇది మూడు రేట్లు ఎక్కువ. ఈ మృతులందరూ మధ్య విసాయాస్ ప్రాంతానికి చెందినవారే అని అధికారులు పేర్కొన్నారు.

సముద్రంలో వచ్చిన ఈ భూకంపం వల్ల విద్యుత్ లైన్లు, వంతెనలు, వందేళ్ల పురాతన చర్చి సహా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం 2013లో పొరుగున ఉన్న బోహోల్ ద్వీపంలో సంభవించిన 7.2 తీవ్రత గల భూకంపం తర్వాత దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైనదిగా అధికారులు పేర్కొన్నారు. 2013 నాటి భూకంపంలో 222 మంది మరణించగా.. ఇప్పుడు ప్రస్తుతానికి మృతుల సంఖ్య 72కి చేరింది. ఫిలిప్పీన్స్ “పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉన్నందున, ఏటా 800కు పైగా భూకంపాలు సంభవిస్తుంటాయి.

Tags:    

Similar News