Biden - Modi: ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీని ప్రశంసించిన జో బైడెన్‌

మానవతా సాయానికి మద్దతుగా నిలిచారని వ్యాఖ్యా;

Update: 2024-08-27 03:45 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రశంసలు కురిపించారు. మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించడాన్ని కొనియాడారు. ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని.. కొనసాగుతున్న మానవతా సాయానికి మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు.

‘‘పోలండ్, ఉక్రెయిన్‌లో మోదీ ఇటీవలి పర్యటన గురించి చర్చించడానికి ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన శాంతి సందేశం, మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి. ఇండో-పసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి మేం మా నిబద్ధతను పునరుద్ఘాటించాం’’ అని బైడెన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆ దేశంలో హిందువులు సహా మైనారిటీలందరికీ భద్రత లభించేలా చూడాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త పరిణామాలెన్నో తమ మధ్య సమగ్రంగా చర్చకు వచ్చాయని, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

గత నెల మోదీ చేపట్టిన రష్యా పర్యటనపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించారు. దీంతో విమర్శలను సమర్థంగా ఎదుర్కోవడానికే మోదీ ఈ పర్యటన చేపట్టారనే విశ్లేషణలు వెలువడ్డాయి. యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలు జరిపి ఓ పరిష్కారానికి రావాలని ఈ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్‌ క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. 

Tags:    

Similar News