PoK: పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పీఓకేలో నిరసనలు.. పాక్ ఆర్మీ కాల్పులు..
పీఓకే వ్యాప్తంగా ఉద్రిక్తత..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తు్న్నారు. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వీరిని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ, పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ ఆర్మీ ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పీఓకేలోని కోట్లీలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. మరణాల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం, పర్యాటకుల్ని పీఓకే వెళ్లవద్దని సూచించింది. జర్నలిస్టులు, మీడియా పీఓకేలోకి ప్రవేశించకుండా నిషేధించింది. పీఓకేలో 2000 మంది పోలీస్ సిబ్బంది, 167 ఎఫ్సీ ఫ్లాటూన్లను మోహరించినట్లు తెలుస్తోంది.
ద్రవ్యోల్బణం, ఉపాధి, తమ ప్రాంతంలోని వనరుల్ని పాకిస్తాన్ దోచుకుని వెళ్తుందని పీఓకే ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనలు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతోంది. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి, ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. పీఓకేలో ఇలా నిరసనలు జరగడం ఇదే మొదటిసారి కాదగు, గతంలో రావల్ కోట్ పాక్ ఆర్మీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిమ్ మునీర్, షరీఫ్ లు ట్రంప్ చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.