పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత
అరెస్టు తరువాత పరిణామాలపై పాక్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దేశంలోని ఘర్షణలకు ఇమ్రాన్ పార్టీ పీటీఐనే కారణమని;
పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత అది తీవ్రరూపం దాల్చింది. అరెస్టు తరువాత పరిణామాలపై పాక్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దేశంలోని ఘర్షణలకు ఇమ్రాన్ పార్టీ పీటీఐనే కారణమని, దానిని నిషేధించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిపై రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ సైతం స్పందించారు. పీటీఐపై నిషేధం విధించే అంశం పరిశీలనలో ఉందన్నారు. ఆ పార్టీ దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించిందని చెప్పారు. గతంలో ఎన్నడూ అలా జరగలేదని ఇలాంటి పరిణామాలను ఏ మాత్రం సహించలేమన్నారు.
అవినీతి ఆరోపణలపై మే 9న ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆర్మీ, ప్రభుత్వ కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేశారు. కొన్నింటికి నిప్పంటించారు. దాంతో దాయాది దేశం రణరంగంలా మారిపోయింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఆ ఘటనలకు పాల్పడింది పీటీఐ కార్యకర్తలేనని అధికారపక్షం ఆరోపించింది. అయితే ఆ హింసతో తమకు ఏ సంబంధం లేదని పీటీఐ ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.