గాయాలు బాధిస్తున్నాయి.. అయినా బ్రతకాలని ఉంది..

జీవితం చాలా విలువైనది.. ఇంతకు ముందు ఎలా జీవించారో.. కానీ కనీసం ఇప్పుడైనా మీ జీవితాన్ని మంచిగా గడపడానికి ప్రయత్నించండి..

Update: 2020-09-06 11:29 GMT

జీవితం చాలా విలువైనది.. ఇంతకు ముందు ఎలా జీవించారో.. కానీ కనీసం ఇప్పుడైనా మీ జీవితాన్ని మంచిగా గడపడానికి ప్రయత్నించండి.. డబ్బు సంపాదించడంతో పాటు, మనుషుల్ని ప్రేమించడం కూడా నేర్చుకోండి.. నా వీపుకు తగిలిన గాయాలతో నేను కోలుకోలేకుండా ఉన్నాను.. నా వాళ్లను కలుసుకోవాలనుంది. నా పిల్లలను ముద్దాడాలని ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి అని 29 ఏళ్ల జాకబ్ బ్లేక్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న జాకబ్..

అమెరికాలో జాతి వివక్ష కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. నల్ల జాతీయులపై తెల్లజాతీయులు దాడులు, హత్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. చట్టాలు మారినా, అధ్యక్షులు మారినా జాత్యహంకారం పెచ్చు మీరుతూనే ఉంది. మొన్నటికిమొన్న జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం మరువక ముందే మరో సంఘటన నల్ల జాతీయుల్లో ఆగ్రహావేశాలు రగలడానికి కారణమైంది.

ఆగస్టు 23న విస్కాన్ సిన్ నగరానికి దగ్గరలో ఉన్న కెనోషా అనే ప్రాంతంలో జాకబ్ అనే నల్ల జాతీయుడు ఇంటికి వెళదామని కారు వద్దకు వచ్చాడు. అంతలో ఇద్దరు తెల్ల జాతి పోలీసులు వచ్చి జాకబ్ ని అడ్డుకుని ఏదో అడిగారు.. ఆ తరువాత విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం తుపాకీ తీసుకుని అతని వీపు మీద కాల్చడంతో ఎనిమిది బుల్లెట్లు శరీరంలోకి దూసుకువెళ్లాయి. ఆ సమయంలో జాకబ్ ముగ్గురు పిల్లలు కారులోనే ఉన్నారు.

హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో అక్కడి వారంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకుని జాకబ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జాకబ్ ఆస్పత్రి బెడ్ పై కదల్లేని స్థితిలో ఉన్నాడు. అతడు కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని వైద్యులు వివరించారు. డాక్టర్ల సహాయంతో తన మనసులోని మాటలను రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.. నిద్ర రావట్లేదు.. నొప్పి భరించలేకుండా ఉన్నాను. నా వాళ్లను కలుసుకోవాలనుంది.. జీవితం చాలా విలువైంది.. సాటి మనిషి పట్ల దయతో ఉండండి అని ఉద్వేగంతో జాకబ్ పలికిన మాటలు వైరల్ అయ్యాయి. కాగా, జాకబ్ కు మద్దతుగా విస్కాన్ సిన్ పౌరులు నగరంలో ఆందోళన చేపట్టారు. జాకబ్ పై కాల్పులు జరిపిన పోలీసులను సిటీ పోలీస్ విధుల నుంచి తొలగించింది.

Tags:    

Similar News