Delhi: ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..
పోలీసులు అప్రమత్తం
దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా వీహెచ్‌పీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఆందోళనకారులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఆందోళనకారులు బారికేడ్లను తోసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది.
బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందూ వ్యక్తి దీపు దాస్‌ను అత్యంత దారుణంగా హతమార్చారు. అంతేకాకుండా హిందువులపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపు దాస్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ ముహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
భారతదేశంలోని తమ దౌత్య కార్యకలాపాలపై దాడులపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ, సిలిగురిలో జరిగిన సంఘటనలను నిరసిస్తూ భారత హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలిపింది. ఇది దౌత్య సిబ్బంది భద్రతకు హాని కలిగించడమే కాకుండా పరస్పర గౌరవం, శాంతి, సహనం విలువలను కూడా దెబ్బతీస్తుందని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.