Heavy Rains In China : చైనాలో భారీ వర్షాలు

15 మంది మృతి, పలువురి గల్లంతు

Update: 2023-07-05 10:45 GMT

చైనాలో కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాలు వరదల వల్ల 15 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. మౌలిక సదుపాయాలు దెబ్బ తినడంతో వేలాదిమంది ప్రజలు సహాయక శిబిరాలకు వెళ్లిపోయారు.

మారుతున్న వాతావరణ పరిస్థితులతో అనేక దేశాలు అతలాకుతలమవుతున్నాయి. చైనాలో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు విపరీతమైన ఎండతో మండిపోయిన చైనా ఇప్పుడు భారీ వర్షాలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఎండలు ఎక్కువగా ఉండటం ముందుగా పంటలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో రుతుపవనాలు ఆలస్యం అయిన ప్రభావం గోధుమ పంట మీద తీవ్రంగా చూపింది. ఇప్పుడిప్పుడే కాస్త జాగ్రత్త పడుతున్న సమయంలో వచ్చిన వరదలు చైనాను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.




 


జూలై నెలలో చైనా అనేక ప్రకృతి విపత్తులను ఎదుర్కోబోతుందని చైనా విపత్తుల సంస్థ అక్కడ ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు, రికార్డులు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, తుఫాన్లు వంటివి కూడా సంభవిస్తున్నాయి. ప్రస్తుతానికి వాయువ్య చైనాలో కురుస్తున్న వర్షాలతో అక్కడ ఒక రైల్వే వంతెన కూలిపోయింది. సించువాన్ ప్రావిన్స్ లో భారీ వర్షాల కారణంగా నాలుగు లక్షల అరవై వేల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 85 వేల మంది ప్రజలు తమ ఇల్లు ఖాళీ చేశారు. సెంట్రల్ హునాన్ ప్రాంతంలో 25 వేల ఇళ్ళు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయని చైనా అధికారిక మీడియా వీడియోలను విడుదల చేసింది. నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలో సోమవారం నుంచి బుధవారం వరకు ఉదయం 7 గంటల వరకు కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 15 మంది మరణించారు.




 


మరో నలుగురు తప్పిపోయారని చైనా అధికారులు చెప్పారు. భారీవర్షాల వల్ల నైరుతి చైనాలో అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాలు, వరదల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారులను ఆదేశించారు. అధికారులు ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News