Russia-India: పుతిన్ పర్యటనకు ముందు భారత్‌కు రష్యా బిగ్ గిఫ్ట్

కీలకమైన సైనిక ఒప్పందం రెసిప్రొకల్ ఆపరేషన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అధికారి ఆమోదం

Update: 2025-12-03 01:15 GMT

రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఇంతలో ఆ దేశం భారత్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చింది. రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమా భారత్‌తో కీలకమైన సైనిక ఒప్పందమైన రెసిప్రొకల్ ఆపరేషన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ (RELOS)ను అధికారికంగా ఆమోదించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు ఈ చర్య తీసుకున్నారు. ఈ అంశంపై డూమా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ మాట్లాడుతూ.. భారతదేశంతో రష్యా సంబంధాలు వ్యూహాత్మకం, సమగ్రమైనవని అభివర్ణించారు. ఈ ఒప్పందానికి ఆమోదం పొందడం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమైన అడుగు అని అన్నారు. ఇది సైనిక సహకారంలో అన్యోన్యతను పెంచుతుందని, రెండు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తుందని నొక్కిచెప్పారు.

ఈ ఒప్పందంపై ఫిబ్రవరి 18న మాస్కోలో భారత రాయబారి వినయ్ కుమార్, అప్పటి డిప్యూటీ రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ సంతకం చేశారు. RELOS కింద, రెండు దేశాల సైనిక నౌకలు, విమానాలు, దళాల వైమానిక స్థావరాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ సౌకర్యాలను పరస్పరం ఉపయోగించుకోగలుగుతాయి. ఇందులో ఇంధనం నింపడం, మరమ్మతులు, సాంకేతిక సహాయం, అత్యవసర మద్దతు వంటి కీలకమైన సహాయ సహకారాలు అందుతాయి. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య అనేక రంగాలలో సహకారాన్ని సులభతరం చేస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ, మానవతా సహాయం, ప్రకృతి, మానవ నిర్మిత విపత్తులను ఎదుర్కొనేందుకు సహాయపడతాయి. ఈ ఒప్పందం కార్యాచరణ స్థాయిలో సహకారాన్ని బలోపేతం చేయడమే కాకుండా దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిస్తుందని రష్యా ప్రభుత్వం డూమా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోట్‌లో రాసింది. పుతిన్ రెండు రోజుల భారత పర్యటన అనేక ముఖ్యమైన ఒప్పందాలకు దారితీస్తుందని భావించింది. కాగా.. ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ భార‌త్‌లో ప‌ర్యటించ‌నున్నారు. డిసెంబ‌ర్ 4, 5 తేదీల్లో భార‌త్‌లో ప‌ర్యటించ‌నున్నట్టు ర‌ష్యా అధ్యక్ష కార్యాల‌యమైన క్రెమ్లిన్ అధికారికంగా ప్రక‌టించింది. భార‌త‌ ప్రధాని మోడీ ఆహ్వానం మేర‌కు పుతిన్ ఈ ప‌ర్యట‌న చేప‌ట్టనున్నట్టు ప్రక‌టించింది.

Tags:    

Similar News