Russia : ఐ ఫోన్ అంటే భయపడిపోతున్న రష్యా
యాపిల్ ఉత్పత్తులపై పుతిన్ అనధికార నిషేధం;
ఓవైపు ప్రిగోజిన్ తిరుగుబాటు.. మరోవైపు క్రిమియా జీవనాడైన కెర్చ్ వంతెనపై దాడి నేపథ్యంలో రష్యా పాశ్చాత్య దేశాల విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తోంది. అమెరికా సాఫ్ట్‌వేర్, ప్రాశ్యాత్య దేశాల సైబర్ నెట్‌వర్క్‌లతో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆ దేశాల ఉత్పత్తులపై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పెరుగుతుండగా.. రష్యా ప్రభుత్వం మాత్రం వాటిని వాడాలంటే భయపడుతోంది. వేలమంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు వాటిని వాడవద్దని ఇప్పటికే పుతిన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
యాపిల్ అమెరికాకు చెందిన సంస్థ కావడం, దీంతో అక్కడి కంపెనీలు తమపై గూఢచర్యానికి పాల్పడుతున్నాయనే ఆందోళనలు పెరగడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తమ అధికారులకు ఇదివరకే ఈ మేరకు ఆదేశాలు జారీచేయగా, తాజాగా అక్కడి వాణిజ్యశాఖ కూడా ఐఫోన్లను వాడవద్దని ఉద్యోగులను ఆదేశించింది.
ఐఫోన్లు, ఐపాడ్‌తోపాటు యాపిల్ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తుల వాడకంపై రష్యా ప్రభుత్వశాఖలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తమ సంస్థలపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గూఢచర్యానికి పాల్పడే ఘటనలు పెరుగుతున్నాయని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌తోపాటు అక్కడి ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్లను వినియోగించవద్దని, వాటికి ప్రత్యామ్నాయ ఫోన్లను వినియోగించాలంటూ వివిధ మంత్రిత్వశాఖల్లోని డిప్యూటీ మంత్రులు, ఉన్నతోద్యోగులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా వాణిజ్య శాఖ కూడా అధికారిక పనుల కోసం ఐఫోన్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో డిజిటల్ డెవెలప్‌మెంట్ మినిస్ట్రీతోపాటు ప్రభుత్వ నిర్వహణలోని రోస్టెక్ సంస్థ కూడా ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు అంగీకరించింది.
గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత.. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ, ఆర్థిక రంగాల్లో 2025 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌నే వినియోగించాలనే నిర్ణయంపై పుతిన్ సంతకం చేశారు. ఈ క్రమంలోనే యాపిల్ ఉత్పత్తుల వాడకంపై అనధికారిక నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా సహా ప్రాశ్యాత్య దేశాల ఉత్పతుల కొనుగోలు రష్యాలో చాలా పడిపోయినట్లు తెలుస్తోంది.