Russia Ukraine War: కిరాయి సేనలపై చర్యలు ఉండవన్న పుతిన్

పుతిన్‌కు బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెన్కో అండగా నిలిచారు

Update: 2023-06-26 08:10 GMT


రష్యా అధినేత పుతిన్‌... వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ డిమాండ్లకు పూర్తిగా తలొగ్గినట్లు కనిపిస్తోంది. కిరాయి సేనలపై కఠిన శిక్షలు తీసుకుంటామని హెచ్చరించిన పుతిన్.... బెలారస్‌ రాయబారం తర్వాత.. ప్రిగోజిన్‌, వాగ్నర్‌ సేనలపై కేసులు ఉండవంటూ క్రెమ్లిన్‌ చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. ముంచుకొస్తున్న ముప్పును అడ్డుకోవాలంటూ పుతిన్‌ మిత్ర దేశాలైన తుర్కియే, కజగిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లను కోరారు. ఒక విధంగా డిఫెన్స్‌లో పడిపోయిన పుతిన్‌కు బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెన్కో అండగా నిలిచారు. శనివారం రాత్రి రంగంలోకి దిగిన అలెగ్జాండర్‌ ప్రయత్నాలు ఫలించాయి. ఆ వెంటనే.. ‘రక్తపాతాన్ని కోరుకోవడం లేదు. అధికార మార్పిడి మా లక్ష్యం కాదు. అందుకే మా సేనలను వెనక్కి రావాలని ఆదేశించామంటూ ప్రిగోజిన్‌ ఒక ప్రకటన చేశారు. ఆ వెంటనే బెలార్‌సకు ధన్యవాదాలు తెలుపుతూ క్రెమ్లిన్‌ ప్రకటన విడుదల చేసింది. తిరుగుబాటు ముగిసిందని ప్రకటించింది.

తిరుగుబాటును నిలిపేందుకు ప్రిగోజిన్‌ అనేక డిమాండ్ల చేశారు. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ గెరాసిమోవ్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇక ఆయనపై ఉన్న దేశద్రోహం, ఇతర క్రిమినల్‌ కేసులను ఉపసంహరించాలన్నారు. దీనికి రష్యా అంగీకరించింది. ఇక ఆయన బెలార్‌సకు వెళ్లేందుకు సైతం రష్యా సమ్మతించింది. దీంతో పాటు తిరుగుబాటులో పాల్గొన్న వాగ్నర్‌ సేనలు ఉక్రెయిన్‌ యుద్ధభూమికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని... . వారిపైనా కేసులు ఉండవని తెలిపింది. తిరుగుబాటులో పాల్గొనని వాగ్నర్‌ సేనలకు సైన్యంలో అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. తాజా పరిణామాలు చూస్తుంటే... రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పుతిన్‌ బలహీనపడినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News