Moscow car bomb: మాస్కోలో పేలిన కారుబాంబు: రష్యన్ జనరల్ మృతి
ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్లు అనుమానాలు
మాస్కోలో జరిగిన కారు బాంబు దాడిలో కీలక రష్యా సైనిక జనరల్ ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రష్యా దర్యాప్తు సంస్థ వెల్లడించింది. రష్యా సాయుధ దళాల జనరల్ స్టాఫ్‌కు చెందిన ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టర్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్, బాంబు దాడి ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో మరణించినట్లు ఆ సంస్థ తెలిపింది.
ఆయన కారు కింద అమర్చిన పరికరం పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్టుమెంట్ దగ్గర కారు పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్లు రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. మున్ముందు మరిన్ని దాడులు చేస్తామని కూడా హెచ్చరించింది.