ముస్లింల పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ చేయడానికి వచ్చారని తెలిపింది. కాగా, అస్వస్థతకు గురైన 95 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు ఉన్నారు.
ఈ ఏడాది హజ్ యాత్రకు దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈజిప్టు నుంచి మరో 10 లక్షలకుపైగా ముస్లింలు తరలివచ్చారని ప్రభుత్వం తెలిపింది. అయితే అధిక ఎండలు, వేడి గాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారని పేర్కొంది. ఉక్కపోతతో ఊపిరాడక వారంతా చనిపోయినట్టు వెల్లడించింది. మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు చెప్పారు.
హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారని వెల్లడించింది. అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు పేర్కొంది.