Singapore Airlines: విమానంలో భారీ కుదుపులు , హడలెత్తిపోయిన ప్యాసింజర్స్
వెలుగులోకి భయానక దృశ్యాలు..;
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. ఏడుగురు పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రయాణికుల్లో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. విమానాన్ని బ్యాంకాక్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది.లండన్ నుంచి సింగపూర్‌కు విమానం బయల్దేరి అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరాల్సి ఉంది. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళుతోంది. కొందరు ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పై నుంచి వస్తువులు జారి పడుతున్నాయి.. సీట్లలో ఉండాల్సిన వ్యక్తులు ఎగిరి పడుతున్నారు.. ఆకాశం నుంచి ఒక్క ఉదుటన దూకేసినట్లుగా ఉంది పరిస్థితి. ఆ గందరగోళం మధ్య విమానం బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానమంతా చిందర వందర.. రక్తపు మరకలు అంటుకున్నాయి.
ఒక వృద్ధుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అతను గుండెపోటుతో మరణించి ఉంటారని భావిస్తున్నారు. బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మృతుని కుటుంబానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంతాపం ప్రకటించింది. గాయపడ్డ వారికి తగిన చికిత్స అందజేస్తున్నామని తెలిపింది.