H1వీసాల జారీ ఇకపై భారత్ లోనే: ప్రధాని మోదీ
భారత్‌లో రెండు అమెరికా కాన్సులేట్ సెంటర్‌లు.. అద్భుత ప్రయాణం ప్రారంభమైందన్న మోడీ... మోడీ కాళ్లకు నమస్కరించి అమెరిక గాయని...;
భారత్-అమెరికా సంబంధాల విషయంలో అద్భుతమైన ప్రయాణం మొదలైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మూడు రోజుల అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా.. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల పాత్రను ప్రశంసించారు. బెంగళూరు అహ్మదాబాద్‌లలో అమెరికా కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించనున్నట్లు మోడీ ప్రకటించారు. అమెరికా-భారత ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడానికి రెండు కొత్త కాన్సులేట్‌లను తెరవాలని భావిస్తున్నట్లు అమెరికా ఇటీవలే ప్రకటించింది. ఈ కాన్సులేట్‌లు ప్రారంభమైతే భారతీయులు హెచ్-1బీ వీసా కోసం అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదని ప్రధాని ప్రకటించారు. హెచ్-1బీ వీసా రెన్యూవల్‌ను ఇక భారత్‌లోనూ చేసుకోవచ్చని మోడీ వివరించారు. కొత్త వీసా నిబంధనలు చాలా సరళతరంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ గీతాన్ని ఆలపించి.. ఎంతో మంది భారతీయుల మనసు దోచుకున్న ప్రఖ్యాత అమెరికన్ గాయని మేరీ మిల్బెన్.. మోడీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. భారత ప్రధాని కోసం జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో గౌరవంగా ఉందన్న మేరీ మిల్బెన్.. అమెరికన్, భారత గీతాలు రెండు కూడా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు ఆదర్శమన్నారు. అమెరికా పర్యటనలో ప్రధాని మోడీకి బైడెన్ మరచిపోలేని బహుమతిని ఇచ్చారు. మోడీకి బైడెన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక టీ షర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. భారత్-అమెరికా మధ్య స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలనే నిబద్ధత అలాగే ఉందన్న మోదీ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో... అమెరికా-ఇండియా(AI) బంధం మరింత బలోపేతమవుతుందని మోడీ చమత్కరించారు.