Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతిపై ఛార్జిషీట్ దాఖలు..
3,500 పేజీల ఛార్జిషీటు సిట్ దాఖలు
సింగపూర్‌లో మృతిచెందిన గాయకుడు జుబీన్ గార్గ్ కేసులో అస్సాం పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. 3,500 పేజీల ఛార్జిషీటును సిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఏడుగురు నిందితులు కస్టడీలో ఉన్నట్లుగా పేర్కొంది. ఇక ఛార్జిషీట్ దాఖలు సమయంలో కోర్టు వెలుపల పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ‘జస్టిస్ ఫర్ జుబీన్’ అంటూ బ్యానర్లతో నినాదాలు చేశారు.
ఇక సిట్ దాఖలు చేసిన ఛార్జిషీటులో జుబీన్ గార్గ్ మరణంపై 300 మందికి పైగా వ్యక్తులను విచారించినట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. మేనేజర్ సిద్ధార్థ శర్మ, నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, గాయని అమృత ప్రభ, సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, కజీన్ సందీపన్ గార్గ్, పీఎస్‌వోలు పరేష్, బైశ్యా, నందీశ్వర్ బోరా ఉన్నట్లు తెలిపింది. వీరంతా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నట్లు పేర్కొంది.
జుబీన్ గార్గ్ (52) సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక ముఖ్యమంత్రి హిమంత్ శర్మ అసెంబ్లీలో మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్ హత్యకు గురయ్యారని వెల్లడించారు. ఇటు లోక్‌సభలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.