South Korean President : ఎమర్జెన్సీ విధించిన సౌత్ కొరియా ప్రెసిడెంట్ అరెస్ట్
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆయన అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ‘మార్షల్ లా’ విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున వందలమంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. తొలుత అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొంతసేపు ప్రతిష్టంభన నెలకొన్న తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడినుంచి తరలించారు. అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.