Spain : వరదలతో స్పెయిన్ అతలాకుతలం.. విమాన సర్వీసులకు బ్రేక్

Update: 2024-10-30 08:21 GMT

భారీవర్షాలు,వరదలు స్పెయిన్ నగరాన్ని ముంచేశాయి. దంచికొట్టిన వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. అనేక చోట్ల రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల జనజీవనం స్థంభించింది. స్కూళ్లు మూతపడ్డాయి. విమాన, రైలు ప్రయాణాలపై కూడా ప్రభావం పడింది. స్పెయిన్‌లోని తూర్పు ప్రాంతమైన వాలెన్సియాలో కుండపోత వర్షాల కారణంగా వరదలు పెద్ద ఎత్తున పోటెత్తాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతోపాటు పలు చోట్ల రోడ్లపై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోయాయి. పలు వాహనాలు కొట్టుకుపోవడంతో పలువురు గల్లంతయ్యారు. దీంతో ఆయా ప్రాంతాల్లోనే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా మారింది.

వరదలతో కనీసం ఏడుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వాలెన్సియాలో ఒక ట్రక్ డ్రైవర్, ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు. డ్రోన్‌ల సహాయంతో అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు రావడంతో అత్యవసర సేవా సిబ్బంది పలు మృతదేహాలను వెలికితీశారు. వరదల కారణంగా రైలు, విమాన ప్రయాణాలపై ప్రభావం పడింది. వాలెన్సియా విమానాశ్రయంలో దిగాల్సిన 12 విమానాలను స్పెయిన్‌లోని ఇతర నగరాలకు మళ్లించారు. పలు విమానాలు రద్దు అయ్యాయి. వరదల కారణంగా ఆయా ప్రాంతాల్లోని పలు రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. పలు ఏరియాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. 

Tags:    

Similar News