MEA: పలు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
స్పందించిన భారత్, సంప్రదింపులు జరుపుతోందన్న విదేశాంగ శాఖ;
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనిక పరంగా తోడ్పడుతున్న భారత్‌కు చెందిన పలు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. సమస్యల పరిష్కారానికి అమెరికా అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
ఎగుమతి నియంత్రణ నిబంధనలపై భారతీయ కంపెనీలకు అవగాహన కల్పించేందుకు సంబంధిత విభాగాలు, ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. రష్యా యుద్ధానికి సహకరించేలా ఉత్పత్తులు, సేవల్ని అందించడంతో పాటు ఆంక్షల్ని తప్పించుకునేందుకు ఆ దేశానికి సహకరిస్తున్నాయని తప్పు పడుతూ 398 సంస్థలపై అమెరికా ఇటీవల ఆంక్షలు విధించింది.
చైనాతో ఒప్పందం ప్రకారం.. దెప్సాంగ్, డెమ్‌చోక్‌లలో పెట్రోలింగ్ మొదలైందని విదేశాంగశాఖ పేర్కొంది. ఈ జాబితాలోని సంస్థల్లో రష్యా, చైనా, భారత్‌తో పాటు మరో డజను ఇతర దేశాలకు చెందినవి ఉన్నాయి. అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన జాబితాలో భారత్‌కు చెందిన అబార్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్, డెన్వాస్ సర్వీసెస్, ఎమ్‌సిస్‌టెక్, గ్యాలక్సీ బేరింగ్స్ లిమిటెడ్, ఆర్బిట్ ఫిన్‌ట్రేడ్ ఎల్‌ఎల్‌పీ, ఇన్నోవియో వెంచర్స్, కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఖుష్బూ హానింగ్, లోకేశ్ మెషిన్స్ లిమిటెడ్, పాయింటర్ ఎలక్ట్రానిక్స్, ఆర్‌ఆర్‌జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, షార్ప్‌లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్, శౌర్య ఏరోనాటిక్స్, శ్రీజీ ఇంపెక్స్, శ్రేయా లైఫ్ సైన్సెస్ ఉన్నాయి.