Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌పై పాక్ వైమానిక దాడులు...
అలా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే...
తాలిబన్ పాలనలోని ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ దాడులకు పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌పై గురువారం రాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సరిహద్దుల్లోని ఉగ్రవాదుల స్థావరాలను ఇకపై సహించబోమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర హెచ్చరికలు చేసిన కొన్ని గంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం. కాబూల్ నగరంలో పేలుడు శబ్దం వినిపించిందని, కానీ ఎటువంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని ఆఫ్ఘన్ తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పినట్లు పాకిస్తాన్ వార్తా సంస్థ DAWN పేర్కొంది. ‘‘కాబుల్ నగరంలో పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా బాగానే ఉంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది... ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు’’ అని ఆయన తెలిపారు.
ఇదిలాఉంటే, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి వచ్చి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కీలక చర్చలు జరపనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదం సహించలేనిదంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పడంపై పులువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో గురువారం రోజున ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ... ఆఫ్ఘనిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘చాలు ఇక చాలు... మా సహనం నశించింది. ఆఫ్ఘన్ గడ్డ నుంచి ఉగ్రవాదం సహించలేనిది’’ చెప్పారు. మూడేళ్ల క్రితం తాను, ఇతర సీనియర్ అధికారులు కాబూల్‌ను సందర్శించామని... అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులను వారు తలదాచుకునే స్థావరాలను మూసివేయాలని హెచ్చరించామని ఖవాజా ఆసిఫ్ తెలిపారు. అయితే వారి నుంచి ఎలాంటి హామీ లభించలేదని చెప్పారు.
ఆఫ్ఘన్ గడ్డపై తమకు ముప్పు కలిగించే 6,000–7,000 మంది వ్యక్తులు స్థిరపడ్డారని ఆఫ్ఘన్ అధికారులకు చెప్పామని... ఆ వ్యక్తులను అక్కడే ఉంచడానికి ఆర్థిక తోడ్పాటు ఏర్పాటు చేయాలని కూడా ఆఫ్ఘన్‌కు సూచించినట్లు ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఆ వ్యక్తులు మళ్లీ పాకిస్తాన్‌కు తిరిగి రారని హామీ ఇవ్వాలని తాము డిమాండ్ చేశామని... కానీ ఆఫ్ఘన్ అధికారులు ఆ హామీలు ఇవ్వడానికి సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు.
తాలిబన్లకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరిక చేసిన కొన్ని గంటల తర్వాత... కాబుల్‌పై పాక్ దాడులు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సోషల్ మీడియాలో వచ్చిన ధ్రువీకరించని నివేదికల ప్రకారం... పాక్ వైమానిక దాడులకు పాల్పడిందని, ఆ దాడుల తర్వాత కాబుల్ గగనతలంలో పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లు కనిపించాయని, అనేక పేలుళ్లు వినిపించాయని తెలుస్తోంది. ఇక, కాబుల్‌లో పాకిస్తాన్ వైమానిక దళం దాడులు చేసిందని స్థానిక మీడియా సైతం ఆరోపించింది.
మాజీ బీబీసీ జర్నలిస్ట్, కాబూల్ యూనివర్సిటీ మాజీ లెక్చరర్ అయిన కబీర్ హక్మల్ ఎక్స్‌లో చేసిన పోస్టులో కాబుల్‌లో పెద్ద శబ్దాలతో పేలుళ్లు వినిపించాయని, ఆ తర్వాత కాల్పులు కూడా వినిపించాయని పేర్కొన్నారు. ధ్రువీకరించని నివేదికలు నగరం తూర్పు వైపు, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ 8 ప్రాంతంలో ఈ శబ్దాలు వచ్చాయని... నగరమంతా విమానాల శబ్దం కూడా వినిపించిందని హక్మల్ తన పోస్ట్‌లో తెలిపారు.
అయితే ఈ ఘటనను తాలిబన్లు ధ్రువీకరించారు. దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. పరిస్థితి అదుపులో ఉందని హామీ ఇవ్వడమే కాకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని వారు కోరారు. అయితే, ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్ అయిన పాకిస్తాన్... ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపిస్తూ మరొక దేశంపై బెదిరింపులకు పాల్పడటం విడ్డూరం.