Arvind Kejriwal: ఎన్నికల ముందు కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కీలక అప్డేట్
బెయిల్ పిటిషన్‌పై మే 7న వాదనలు వింటామన్న న్యాయస్థానం;
ఎన్నికల నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని మే 7న విచారిస్తామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ -EDకి తెలిపింది. విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదికి సూచించింది. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సమయం పడుతుందన్న ధర్మాసనం..ఆ కారణంగానే మధ్యంతర బెయిల్ పిటిషన్ ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. కేవలం పిటిషన్ ను మాత్రమే విచారిస్తామని మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ ..బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని ఏప్రిల్ 15న ఈడీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రికి మధ్యంతర బెయిల్‌కు అవకాశముందని... అయితే తదుపరి తేదీనే (మే 7న) విచారణ ముగుస్తుందని చెప్పలేమని పేర్కొంది. విచారణ ఈరోజు పూర్తి చేయలేం... మంగళవారం ఉదయానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. విచారణకు సమయం పడుతుందనుకుంటే... వాదనలను బట్టి మధ్యంతర బెయిల్ గురించి ఆలోచించవచ్చునని తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో మీ వాదనలు వింటామని కేజ్రీవాల్‌కు తెలిపింది. కాగా, అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా ఇరుపక్షాలు భావించవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే ఇది సాధ్యమయ్యేలా ముందుకు రావాలని ఈడీని కోరింది. అలాగే కేజ్రీవాల్‌కు ఒకవేళ మధ్యంతర బెయిల్ మంజూరైతే ఆయనకు విధించే షరతులు, సీఎంగా ఏదైనా ఫైళ్లపై సంతకం చేయాలా వద్దా అన్న అంశాలను పరిశీలించాలని ఈడీని సుప్రీంకోర్టు కోరింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21 వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచుకున్న తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఏప్రిల్ 15 వ తేదీన ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.