ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లా వాసి అనుమానాస్పద మృతి
కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్‌బాబు ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని అడిలైట్‌లో సలిస్‌బరిలో ఉంటున్నారు.;
ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్‌బాబు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్‌బాబు ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని అడిలైట్‌లో సలిస్‌బరిలో ఉంటున్నారు. ప్రసవం కారణంగా పుట్టింటికి వచ్చిన అతని భార్య కరోనా నేపథ్యంలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో బిడ్డతో పాటు హరీశ్‌బాబు భార్య ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఇందుకోసం చెన్నై చేరుకున్నారు.
తాను వస్తున్నట్లుచెప్పేందుకు భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా హరీశ్ స్పందించలేదు. దీంతో ఆస్ట్రేలియాలో ఉన్న హరీష్ పెద్దన్నయ్యకు ఫోన్ చేశారు. అతను ఇరుగుపొరుగు ద్వారా ఆరా తీశారు. చివరికి హరీష్ అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు తెలిసింది. ఈ వార్తవిన్న హరీష్ భార్య కుప్పకూలిపోయింది. ఒంటరిగానే ఉంటున్న హరీశ్ ఎలా మరణించాడో తెలియడం లేదంటున్నారు కుటుంబసభ్యులు.
గత ఆరేళ్లుగా ఉద్యోగ నిమిత్తం హరీష్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. హరీష్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ఆస్ట్రేలియా పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా హరీష్ మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది. హరీష్ మృతిపై ఆస్ట్రేలియా పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని బంధువులు కోరుతున్నారు.