తజికిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఉదయం 9.54 గంటలకు ఇది సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
మయన్మార్‌లో ఆఫ్టర్‌షాక్స్
మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, ఆదివారం ఉదయం మయన్మార్‌లోని చిన్న నగరమైన మెయిక్టిలా సమీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వాస్తవానికి గత నెలలో సంభవించిన భూకంపం ధాటికి దెబ్బతిన్న మాండలే, రాజధాని నగరం నేపిడా మధ్య తాజా భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం.
3,649 మంది మృతి
మార్చి 28న మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలిగించింది. భూకంపం ధాటికి మయన్మార్‌లో 3,649 మందికి పైగా మృతి చెందగా, 5,018 మంది గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ తెలిపారు.
ఆపరేషన్ బ్రహ్మ
తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాండలే, నేపిడాలో రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా శోధిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే "ఆపరేషన్ బ్రహ్మను" ప్రారంభించిన భారత్, తాజాగా రెస్క్యూ ఆపరేషన్ కోసం నాలుగు కాళ్లుండే రోబోటిక్స్ మ్యూల్స్‌ను, నానో డ్రోన్లను పంపింది. వీటి సాయంతో శిథిలాల కింద వెతుకుతున్నారు. సిబ్బంది వెళ్లలేని చోటుకి వీటిని పంపి గాలిస్తున్నారు.
భారత్ ఇప్పటికే ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా 31 టన్నుల సామగ్రిని సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో మయన్మార్‌కు పంపింది. మాండలేలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని కూడా అందజేసింది. భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ ఆసుపత్రి భూకంప క్షతగాత్రులకు వైద్య సేవలను అందిస్తోంది. భారత నౌకాదళానికి చెందిన "ఐఎన్‌ఎస్ ఘరియాల్" వందల టన్నుల ఆహారాన్ని తిలావా ఓడరేవుకు చేర్చింది. మరోవైపు క్వాడ్ దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లు- మయన్మార్‌ను ఆదుకునేందుకు ఇటీవల 20 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించాయి.