ఆఫ్గాన్‌లోని రాయబార కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు
Talibans: ఆఫ్గానిస్తాన్‌లోని రాయబార కార్యాలయాల్లో ఏమైనా కీలక సమాచారం దొరుకుతుందా అని వెతుకుతున్నాయి తాలిబన్ దళాలు.;
ఆఫ్గానిస్తాన్‌లోని రాయబార కార్యాలయాల్లో ఏమైనా కీలక సమాచారం దొరుకుతుందా అని వెతుకుతున్నాయి తాలిబన్ దళాలు. ఇప్పటికే, భారత్‌తో పాటు అన్ని దేశాలు తమ సిబ్బందిని తీసుకెళ్లిపోయాయి. ఎంబసీ ఆఫీసులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటిలో ఫైల్స్, కంప్యూటర్స్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. కీలక డాక్యుమెంట్లేవీ దొరక్కపోవడంతో.. కాన్సులేట్ల వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లిపోయారు తాలిబన్లు.
మొదట కాందహార్, హెరాత్ నగరాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో సోదాలు చేశారు. అక్కడ ఖాళీ కుర్చీలు, బెంచీలు తప్ప ఏం దొరకలేదు. దీంతో జలాలాబాద్, కాబూల్‌లోని కాన్సులేట్, ఎంబసీల్లోనూ వెతికారు. అక్కడ కూడా కీలక డాక్యుమెంట్లు దొరకలేదు. మొత్తానికి, తాలిబన్లు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అన్ని దేశాల రాయబార కార్యాలయాలను తెరుచుకోవచ్చని.. మొదటి ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు తాలిబన్లు.
ప్రపంచ దేశాలతో సఖ్యతగా ఉంటామని, ధైర్యంగా ఎవరి పని వాళ్లు చేసుకోవచ్చని చెప్పారు. కాని, పరిస్థితి అందుకు రివర్స్‌లో ఉంది. రాయబార కార్యాలయాల్లో సోదాలు చేయడం, కీలక పత్రాలు ఎత్తుకెళ్లాలని చూడడంతో.. అంతర్జాతీయ సమాజానికి తాలిబన్లు ఎలాంటి వాళ్లో తెలిసొచ్చింది. తాలిబన్ నేతల మాటలు నమ్మడానికి వీల్లేదని ఒక్కో సంఘటన రుజువు చేస్తోంది.