Israel Syria conflict: సిరియాపై విరుచకపడ్డ ఇజ్రాయెల్.. రక్షణ శాఖ ఆఫీస్ పై బాంబుల వర్షం..
ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్ర రూపం;
ఇజ్రాయెల్–సిరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ, సిరియా రాజధాని దమాస్కస్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ గేటు వద్ద గల సైనిక ప్రధాన కార్యాలయం వద్ద దాడులు చేసింది. ఇంతకముందు, దక్షిణ సిరియా నగరమైన స్వైదాలో ప్రభుత్వ, ద్రూజ్ ఆర్మ్‌డ్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలపై మధ్యంతరంగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్, ద్రూజ్ మైనారిటీకి మద్దతుగా నిలుస్తూ.. సిరియాలో మిలిటరీ చర్యలపై ఇంకా కఠినంగా స్పందించవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సిరియా ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు మేం దాడులు కొనసాగిస్తాం. అవసరమైతే మరింత తీవ్రంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ కూడా మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. సిరియా సరిహద్దుల్లో మిలిటరీ లేని ప్రాంతాన్ని పరిరక్షించడం, అక్కడి ద్రూజ్ సముదాయాన్ని కాపాడటం ఇజ్రాయెల్ బాధ్యత అని స్పష్టం చేశారు.
మంగళవారం నాడు చేపట్టిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ద్రూజ్ మిలీషియాలు ఉల్లంఘించాయని ఆరోపిస్తూ, సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక చర్యలు మళ్లీ ప్రారంభించింది. స్వైదా నగరంలో ప్రభుత్వ బలగాలు విరుచుకుపడ్డాయి. నివాస ప్రాంతాల్లో కాల్పులు, హత్యలు, ఇంటింటా దోపిడీలు, ఇళ్లు తగలబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సిరియా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇదివరకే 30 మంది మృతిచెందినట్టు ప్రకటించగా, సిరియన్ ఆబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (UK ఆధారిత మానవ హక్కుల సంస్థ) బుధవారం ఉదయానికి 250 మందికి పైగా మృతి చెందినట్టు తెలిపింది.